Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాదిగూడ పీహెచ్సీ పరిధిలో అమలు
- తరలించిన వారికి రూ.1200
నవతెలంగాణ-ఉట్నూర్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు సౌకర్యం అంతంతమాత్రంగా ఉన్న గ్రామాలు అనేకం. వర్షాకాలంలో ఉప్పొంగే వాగులు అడవి బిడ్డలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచేస్తున్నాయి. ప్రతి ఏటా అనేక మంది గర్భిణులు, బాలింతలు.. రోగులు వాగులు దాటి ఆస్పత్రులకు వెళ్లేందుకు నరకయాతన అనుభవిస్తున్నారు. కనీసం అంబులెన్స్ వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రసవ సమయంలో గిరిజన మహిళలకు సరైన వైద్యం అందక మృతిచెందిన ఘటనలు ఏజెన్సీలో అనేకం. గర్భిణులు, బాలింతలను వాగుల అవతల ఉన్న గ్రామాల నుంచి వాగు ఇవతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించేందుకు ప్రభుత్వం, అధికారులు ఎడ్ల బండ్లనే అంబులెన్స్‌గా ఏర్పాటు చేశారు. ఇటీవల ఏజెన్సీలోని మారుమూల గిరిజన ప్రాంతమైన గాదిగూడ మండలంలో గిరిజన మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. కానీ, భారీ వర్షాల కారణంగా వాగు పొంగి పొర్లింది. ఆమెను అతికష్టం మీద వాగు దాటించి తీసుకొచ్చినా సకాలంలో వైద్యం అందకపోవడంతో మృతిచెందింది. ఇలాంటి సంఘటనలు గతంలోనూ జరిగాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించగా, అధికారులు కదిలారు. వెంటనే పైలెట్ ప్రాజెక్టు కింద గాదిగూడ పీహెచ్‌సీకి ఎడ్లబండి అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఎడ్లబండిలో రోగిని తరలిస్తే ప్రభుత్వం రూ.1200 చెల్లిస్తుంది.
నెరవేరని సీఎం హామీ
రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఏజెన్సీ గ్రామాలకు అంబులెన్స్ వెళ్లలేని చోట హెలికాప్టర్ అంబులెన్స్‌లను పంపించి గర్భిణులు, బాలింతలను, వ్యాధులతో బాధపడే వారికి మెరుగైన వైద్యం అందిస్తామని కేసీఆర్ 2013లో ఏజెన్సీ పర్యటనలో భాగంగా హామీ ఇచ్చారు. సీఎం హోదాలో సైతం అనేక హామీలిచ్చారు. రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు గడిచినా హెలికాప్టర్ అంబులెన్స్ మాటను ప్రభుత్వం మరిచిపోయింది. వర్షాకాలంలో వాగులు పొంగి ఆస్పత్రులకు వెళ్లేందుకు స్థానికులకు నరకయాతన తప్పడం లేదు.
ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాల్లోనే ఎక్కువ ఘటనలు
ప్రతి ఏడాదీ వర్షాకాలంలో గిరిజనులు పడే బాధలు వర్ణనాతీతం. వాగులు దాటి వెళ్లాల్సిన గ్రామాల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుంది. కనీసం అంబులెన్స్ పోని ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 542 గ్రామాలున్నాయంటే నమ్మక తప్పని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో గర్భిణులను ఆస్పత్రులకు తరలిచేందుకు ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేసిన అవ్వల్ అంబులెన్స్‌లు రహదారి సౌకర్యం లేక వాగులు దాటలేక.. మెరుగైన సేవలందించలేక పోతున్నాయి.
రోడ్డు సౌకర్యం లేక అవస్థలు
గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐటీడీఏ సైతం వారి సమస్యలను పరిష్కరించలేకపోతుంది. మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు విఫలమవుతున్నారు. ఐటీడీఏకు ప్రతి ఏటా కోట్లాది రూపాయలు విడుదలవుతున్నా అధికారులు కనీసం రోడ్డు సౌకర్యం కల్పించడం లేదు. గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు అటవీ శాఖ అనుమతులు ప్రధాన అడ్డంకిగా ఉందనే సాకుతో అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.