Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో పసిమొగ్గ రాలిపోక ముందే ప్రభుత్వం మత్తు వీడాలి : రేవంత్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డ్రగ్స్ కేసులో సినీ నటులు రానా, రకుల్ ప్రీత్ సింగ్‌లను విచారిస్తే రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎందుకు ఉలికి పడుతు న్నారని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్‌తో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి రేవంత్ వైట్ ఛాలెంజ్ (డ్రగ్ టెస్ట్) చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా ప్రకటించిన ప్రకారం సోమ వారం ఉదయం అసెంబ్లీ ఎదురుగా ఉన్నగన్ పార్కు అమ రవీరుల స్థూపం వద్దకు ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంతా సింగరేణి కాలనీలా మారకముందే, మరో పసిమొగ్గ రాలిపోకముందే ప్రభుత్వం మత్తు వీడాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ శాఖ విచారణ నివేదికను ఎందుకు ఈడీకి ఇవ్వడం లేదు? ఐపీ ఎస్ అధికారి అకున్ సభర్వాల్ కమిటీ ఏమైంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. టీఆర్ఎస్ ఏడేండ్ల పాలనలో మాదకద్రవ్యాలు, గంజాయి, మద్యం వాడకం ఎక్కువైందనీ, వాటితో పాటు నేరాలు కూడా పెరిగాయని విమర్శించారు. దేశంలో ఎక్కడిడగ్స్ కేసులు బయటపడినా వాటి మూలాలు తెలంగాణలో కనిపించటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
''డ్రగ్స్‌తో నీకు సంబంధం ఉందని అన్నామా? నువ్వే డ్రగ్స్ టెస్టుకు సిద్ధమేనని సవాల్ చేశావు. కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్ సవాల్ ను నేను స్వీకరించకపోతే... జనానికి అనుమానం వస్తుంది. ఆయన చెప్పిన మాటలకు నేను వైట్ ఛాలెంజ్ అని విసిరా.'' అని రేవంత్ స్పష్టం చేశారు. కేటీఆర్ కూడా గన్‌పార్కు వద్దకు వస్తే బాగుండేదనీ, ప్రజాప్రతినిధులు యువతకు ఆదర్శంగా ఉండేందుకు వైట్ ఛాలెంజ్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో పబ్బులతో పెరుగుతున్న విషసంస్కృతిని అరికట్టాలని డిమాండ్ రేవంత్ చేశారు. కాంగ్రెస్, టీడీపీలు 60 ఏండ్లలో ఆరు పబ్బులకు అనుమతిస్తే టీఆర్ఎస్ ఏడేండ్లలో 60 పబ్బులకు పర్మిషన్ ఇచ్చిందని విమర్శించారు. ఒక రాత్రి సీఎం కేసీఆర్, కేటీఆర్ సాధారణంగా ఆ రోడ్లపై వెళితే పరిస్థితి ఎంతగా దిగజారిందో తెలుస్తుందని సూచించారు. పిల్లలు డ్రగ్స్ మహమ్మారి బారిన పడుతున్నారనీ, చర్యలు తీసుకోవాలని కోరితే కేటీఆర్ ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైట్ ఛాలెంజ్ సవాల్ ను కేటీఆర్ స్వీకరించాలనీ, తేదీ, ఆస్పత్రి నిర్ణయించి చెబితే రావటానికి తాను సిద్దంగా ఉన్నానని రేవంత్ స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు విద్యార్థులకు, యువతకు ఆదర్శంగా ఉండాలని హితవు పలికారు. కేటీఆర్ పూర్వీకులు, తన పూర్వీకుల గురించి చర్చకు తాను సిద్ధమని రేవంత్ స్పష్టం చేశారు.
ఎన్నికలకు డ్రగ్ టెస్ట్ తప్పనిసరి చేయాలి
ఎన్నికల్లో నిలబడే ప్రతీ నాయకునికి డ్రగ్ టెస్టును తప్పనిసరి చేయాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన రేవంత్ వైట్ ఛాలెంజ్‌ను స్వీకరించి గన్ పార్కు వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ఘటన డ్రగ్స్ వల్లనే జరిగిందని చెప్పారు.
ఈ అంశం రాష్ట్రానికి సంబంధించిందనీ, కేటీఆర్ అనవసరంగా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ అధ్యక్షులు బండి సంజరు, బీయస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ లకు ఆయన వైట్ ఛాలెంజ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ, సతీష్ మాదిగ, మానవతారారు, డాక్టర్ మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.
లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమే....
ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షకు పీసీసీ చీఫ్ సిద్ధమా అంటూ కేటీఆర్ ట్వీట్ ద్వారా విసిరిన సవాల్‌ను రేవంత్ స్వీకరించారు. తమతో పాటు కేసీఆర్ కూడా సహారా కుంభకోణం, ఈఎస్ఐ కుంభకోణం, సీబీఐ కేసుల్లో లై డిటెక్టర్ పరీక్షలకు వస్తారా? అని ప్రశ్నించారు.