Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువతి ఆత్మహత్య.. యువకుని పరిస్థితి విషమం
నవతెలంగాణ-ఇల్లందు
భద్రాద్రి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. యువతి మరణించగా, యువకుడు పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం నెహ్రూ నగర్ తండాకు చెందిన బోడ శ్వేత(20) హైదరాబాద్‌లో డిగ్రీ సెకండియర్ చదువుతూ షాపింగ్ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్నట్టు తెలిసింది. ఇదే మండలం కట్టుగూడెం గ్రామానికి చెందిన గుగులోత్ వెంకటేశ్(24) డిప్లొమా చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. హైదరాబాద్‌లోనే ఇద్దరికీ పరిచయం అవ్వగా.. అదికాస్త ప్రేమగా మారింది. ఏడాదిగా ప్రేమించుకుంటున్న ఇద్దరూ పది రోజుల కిందట పెండ్లి చేసుకున్నారు. వీరి స్నేహితులు పెండ్లి ఫొటోలు వాట్సప్ గ్రూపుల్లో పోస్టు చేయడంతో.. విషయం శ్వేత తల్లిదండ్రులైన సోమ్లా, శాంతలకు తెలిసింది. దాంతో ఆమెను తల్లిదండ్రులు ఇంటికి పిలిపించి మందలించారు. 'లంబాడలోని ఇంటిపేరు గుగులోత్, బోడ ఉన్న వారు పెండ్లి చేసుకోవద్దని, మీరు అన్నా చెల్లెళ్లు వరుస అవుతారనీ, తరతరాలుగా వస్తున్న ఆచారమనీ.. నీవు ఎలా పెండ్లి చేసుకున్నావని'' తల్లిదండ్రులు మందలించారు. దాంతో మనస్తాపంతో యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్మకు పాల్పడింది. విషయం భర్త గుగులోత్ వెంకటేశ్‌కు తెలియడంతో వ్యవసాయ బావిలో దూకాడు. స్థానికులు గుర్తించి ఖమ్మం వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కాగా, యువతి కుటుంబ సభ్యులు యువకుడు ఇంటిపై దాడికి యత్నించారు. న్యాయం చేయాలంటూ అతని ఇంటి ఎదుట ధర్నా చేశారు. పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇంటి పేరు భూక్య అని చెప్పి అతను మోసం చేసి కూతురు శ్వేతను పెండ్లి చేసుకున్నాడని తల్లి శాంత విలపించింది. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.