Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డ్రగ్స్, మనీలాండరింగ్ కేసులో ఆగని ఈడీ విచారణ
- ఇంతకీ ఎక్సైజ్ విభాగం తేల్చిందేంటీ?
నవతెలంగాణ-ప్రత్యేకప్రతినిధి
సినీ ప్రముఖులకు ఎక్సైజ్ విభాగం క్లీన్చిట్ వెనుక ఏమున్నది..? రాష్ట్రంలో సంచలనం రేపిన డ్రగ్స్, మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జరుపుతున్న విచారణలో నిగ్గు తేలుతుందా? లేక కథ మొదటికొస్తుందా? నాలుగేండ్లుగా దర్యాప్తు సాగించిన రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్‌కు చెందిన సిట్ అధికారులు చివరకు తేల్చింది ఏమిటీ? సినీ ప్రముఖులకు ఎక్సైజ్ విభాగం క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఈడీ జరుపుతున్న విచారణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై ఈడీ అధికారులు గత ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులను విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటి వరకు టాలీవుడ్ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్, నటీమణులు చార్మీ, రకుల్ ప్రీత్‌సింగ్, ముమైత్‌ఖాన్, నటులు రవితేజ, దగ్గుబాటి రానా, నందు, నవదీప్ తో పాటు తదితరులను ప్రశ్నించారు. బుధవారం నటుడు తరుణ్‌ను విచారించడానికి రంగం సిద్ధం చేశారు. డ్రగ్స్ విక్రేత, ఈ కేసు ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు పై సినీ ప్రముఖుల విచారణను ఈడీ కొనసాగిస్తున్నది. వీరందరినీ నాలుగేండ్ల క్రితం రాష్ట్ర ఎక్సైజ్ సిట్ అధికారులు విచారించారు. కాగా, ఎక్సైజ్ అధికారులు ఈ సినీ ప్రముఖులు డ్రగ్స్‌ను సేవించారా? లేదా? అన్న అంశంపై దృష్టి సారించగా.. ఈడీ అధికారులు మాత్రం వీరు డ్రగ్స్‌ను ఖరీదు చేయడానికి కెల్విన్ ద్వారా విదేశాలకు డబ్బులు పంపించి మనీలాండరింగ్, ఫెమా చట్టాల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న కోణంలో దర్యాప్తును సాగిస్తున్నారు.