Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన వినోద్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఢిల్లీ వంటి నగరాలకే పరిమితమైన బీఏ హానర్స్ కోర్సు హైదరాబాద్‌లోనూ అందుబాటులో ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్‌కుమార్ చెప్పారు. ఈ కోర్సు వల్ల విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని కోఠి మహిళా కాలేజీలో బీఏ హానర్స్ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్లు ఎంపీగా పనిచేశాననీ, ఇక్కడి పిల్లలు ఢిల్లీ వెళ్లి ఆ కోర్సును చదువుతున్నారని చెప్పారు. శ్రీరాం కాలేజీ, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఈ కోర్సు ఎంతో ప్రముఖమైందన్నారు. విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలున్నాయని వివరించారు. తెలంగాణ విద్యార్థులకూ ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే ఈ కోర్సులు అందుబాటులోకి వస్తాయని అన్నారు. కోఠి మహిళా కాలేజీ, నిజాం కాలేజీలో ఈ కోర్సులుంటాయని వివరించారు. పోటీ ప్రపంచంలో ఈ కోర్సుల వల్ల విద్యార్థులు ప్రయోజనం పొందుతారని చెప్పారు. ప్రయివేటు కాలేజీలకు ఈ కోర్సుకు సంబంధించిన అనుమతి ఇవ్వొద్దనీ, ప్రభుత్వ కాలేజీల్లోనే ప్రవేశపెట్టాలని కోరారు. అవసరమైతే ప్రవేశ పరీక్షను నిర్వహించాలని సూచించారు. ఐఐటీలు, ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాల్లోనూ సోషల్ సైన్సెస్ కోర్సులకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఈ కోర్సులను చదివితేనే సమాజం పట్ల విద్యార్థులకు అవగాహన కలుగుతుందని చెప్పారు. సమాజాన్ని అర్థం చేసుకుంటేనే వృత్తిలో ముందుకుపోతారని అన్నారు. ఇక్కడి ఐఐటీలు, మెడికల్ కాలేజీల్లోనూ ఈ కోర్సును ప్రవేశపెట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, ఓయూ వీసీ డి రవీందర్, సెస్ డైరెక్టర్ రేవతి, కోఠి మహిళా కాలేజీ ప్రిన్సిపాల్ విజ్జులత తదితరులు పాల్గొన్నారు.
ఒక కాలేజీలో వెయ్యి సీట్లా? : వినోద్‌కుమార్
రాష్ట్రంలో ఒక ఇంజినీరింగ్ కాలేజీలో వెయ్యి సీట్లా? వాటిని అనుమతి ఎలా ఇస్తారనీ, దీన్ని పరిశీలించాలని విద్యాశాఖ అధికారులను బోయిన్పల్లి వినోద్‌కుమార్ కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో విద్యార్థులు చేరడం లేదని చెప్పారు. మెకానికల్, సివిల్, ఈఈఈ వంటి కోర్సుల్లో సీట్లను తగ్గించుకుని సీఎస్ఈ అనుబంధ కోర్సుల్లో సీట్లు పెంచుకోవడం వల్ల కొన్ని కాలేజీలకు నష్టం కలుగుతున్నదని అన్నారు. గ్రామీణ, పట్టణ కాలేజీలకు మధ్య వ్యత్యాసం ఉందన్నారు.