Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో నియంత పాలన : వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
- దీక్షకు అనుమతి లేదంటూ అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ- బోడుప్పల్
త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు రాక నిరుద్యోగుల ప్రాణం పోతుంటే పాలకులకు పట్టదా.. అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలో నియంత పాలన నడుస్తోందన్నారు. మంగళవారం మేడ్చల్ జిల్లా ఉప్పల్ డిపో వద్ద గల ఎగ్జిబిషన్ గ్రౌండ్లో షర్మిల నిర్వహించతలపెట్టిన నిరుద్యోగ దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆమె రోడ్డుపై బైటాయించగా అరెస్టు చేశారు. బోడుప్పల్ నగరంలో గతేడాది ఉపాధి కరువై, కుటుంబాన్ని పోషించడం కష్టమై ఆత్మహత్య చేసుకున్న రవీందర్ నాయక్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా సర్కారు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిరుద్యోగ నిరసన దీక్షకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వైఎస్సార్ టీపీ శ్రేణులు నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు కార్యకర్తలను అరెస్టు చేసి స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీక్షకు అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ షర్మిల ఉప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి మేడిపల్లి పోలీసు స్టేషన్ వరకు పాదయాత్రగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకుని లోటస్‌పాండ్‌కు తరలించారు. అరెస్టు సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ఎన్నో ఆశయాలు, ఆకాంక్షలతో పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో నేడు నిరుద్యోగం పెరిగిందని, యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తే, దీక్షలు చేస్తే అరెస్టు చేస్తారా? అని నిలదీశారు. ప్రజా సమస్యలపై మాట్లాడే వారి గొంతు నొక్కేలా కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తోందన్నారు. అరెస్టులకు భయపడి ఉద్యమాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ టీపీ నేతలు కొండా రాఘవరెడ్డి, సత్య, ఏపూరి సోమన్న తదితరులు పాల్గొన్నారు. కాగా, షర్మిల దీక్షలో పాల్గొనడానికి వచ్చిన కొందరు తమకు రూ.400 ఇస్తామని తీసుకొచ్చి ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు.