Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25న హజ్‌హౌస్ ఎదుట ధర్నా
- సీఎం కేసీఆర్‌కు 'ఆవాజ్' బహిరంగలేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రప్రభుత్వం ఏడున్నరేండ్ల కాలంలో మైనార్టీల కోసం చేపట్టిన సంక్షేమ కార్యాక్రమాలపై శ్వేతపత్రం ప్రకటించాలని 'ఆవాజ్' డిమాండ్ చేసింది. దీనికోసం ఈనెల 25న హజ్‌హౌస్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్టు ఆవాజ్ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. మంగళవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆవాజ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ మహ్మద్ అన్సారీ, మహ్మద్ అబ్బాస్, ఉపాధ్యక్షులు అజీజ్ అహ్మద్ ఖాన్, జాయింట్ సెక్రటరీ ఎమ్ఏ రజాక్, కోశాధికారి షేక్ అబ్దుల్ సత్తార్, మీడియా కార్యదర్శి సయ్యద్ ఇఫ్తెకార్, రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ యాకూబ్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ మైనార్టీలకు అనేక హామీలు ఇచ్చారనీ, వాటిలో ఏ ఒక్కటీ అమల్లోకి రాలేదని విమర్శించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, మైనార్టీ సబ్‌ప్లాన్, ఉర్దూ స్కూళ్ళ ఏర్పాటు, ఉర్దూ టీచర్ల నియామకం, వక్ఫ్‌బోర్డ్‌కు జ్యుడీషియల్ అధికారాలు సహా అనేక హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. 2015-16 తర్వాత మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఒక్క కొత్త దరఖాస్తును కూడా తీసుకోలేదని చెప్పారు. ఓబీసీ జాబితాలో మైనార్టీలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లను పొందుపర్చాలని డిమాండ్ చేశారు. ఉర్దూను రెండో అధికారిక భాషగా ప్రకటించినా, ఎక్కడా అమలు కావట్లేదనీ, ఉర్దూ పాఠశాలలన్నీ మూతపడ్డాయని చెప్పారు. ముస్లింలకు లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్నారనీ, అవి ఎక్కడ అమలయ్యాయని ప్రశ్నించారు. షాదీ ముబారక్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లోనూ మైనార్టీలకు అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు పాదయాత్ర లో మైనార్టీలకే రాష్ట్ర ప్రభుత్వం అంతా చేస్తున్నదని ప్రచారం చేస్తున్నారనీ, దాన్ని తిప్పికొట్టేందుకు ప్రభుత్వం తక్షణం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏడున్నరేండ్లలో మైనార్టీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయో బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ నేతలకు సవాలు విసిరారు. మైనార్టీల కోసం కేటాయించిన బడ్జెట్లలో కేవలం 25 శాతం కూడా ఖర్చు కావట్లేదని చెప్పారు. బీజేపీ అబద్ధాలను ప్రచారం చేస్తుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఖండించట్లేదని ఆక్షేపించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఈనెల 25న హజ్‌హౌస్ వద్ద జరిగే ధర్నాలో మైనార్టీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.