Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
- బాలానగర్ ఇండస్ట్రీయల్ ఏరియాలో కార్మిక గర్జన పాదయాత్ర
నవతెలంగాణ-బాలానగర్
ప్రభుత్వం కనీస వేతనాల జీవోలను సవరించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం నిర్ణయించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన కార్మికగర్జన పాదయాత్ర మంగళవారం మేడ్చల్ జిల్లా బాలానగర్ పారిశ్రామిక వాడలో కొనసాగింది. పాదయాత్ర బృందానికి కార్మికులు ఘనంగా స్వాగతం పలికారు. కార్మికుల సమస్యలు అడిగి తెలసుకుంటూ పాదయాత్ర బృందం ముందుకు సాగింది. ఈ సందర్భంగా ఎస్.వీరయ్య మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనం రూ.21 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ వైపు కార్మికులను శ్రమదోపిడీ చేసే నిర్ణయాలు తీసుకుంటూ.. మరోవైపు కార్పొరేట్ల సంపద పెరిగేలా కేంద్రం నిర్ణయాలు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి విధానాలను కార్మికలోకం ప్రతిఘటించాలన్నారు. బాలానగర్ పారిశ్రామిక ప్రాంతంలో కనీస వేతనాలు అమలు కావడం లేదని, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు అందక ఎంతోమంది కార్మికులు నష్టపోతున్నారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 73 షెడ్యూల్ ఎంప్లాయీస్ పరిశ్రమల్లో ఉన్న జీవోలను సవరించాలని, రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన 5 జీవోలను వెంటనే గెజిట్ చేయాలని కోరారు. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన 4 కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బాలానగర్ పరిశ్రమల్లో కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఐటీయూ పెద్ద ఎత్తున పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు భూపాల్, పాలడుగు భాస్కర్, పి.జయలక్ష్మి, మల్లికార్జున్, కోటం రాజు, జిల్లా అధ్యక్షులు అశోక్, బాలానగర్ మండల కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్, జిల్లా కోశాధికారి సబితా శంకర్, కృష్ణ నాయక్, సాయి, అరుణ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.