Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టర్ ఆవిష్కరణలో విద్యార్థి సంఘాల నాయకులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును, లేబర్ కోడ్లను రద్దు చేయాలని అఖిల భారత రైతు సంఘాలు ఈనెల 27న తలపెట్టిన భారత్‌బంద్‌ను జయప్రదం చేయాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత్‌బంద్ సన్నాహక సమావేశం జరిగింది. టి నాగరాజు (ఎస్ఎఫ్ఐ), బోయిన్పల్లి రాము (పీడీఎస్‌యూ), అశోక్‌స్టాలిన్ (ఏఐఎస్ఎఫ్), ఎం పరుశురాం (పీడీఎస్‌యూ) బంద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ దేశభక్తి పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని విమర్శించారు. దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తున్నారని అన్నారు. వ్యవసాయ రంగాన్ని, భూమిని, పంటలను కార్పొరేట్లకు అప్పగించేందుకే మూడు చట్టాలను తెచ్చారని విమర్శించారు. పది నెలలుగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ చట్టాలు అమల్లోకి వస్తే విద్యారంగంపైనా ప్రభావం పడుతుందనీ, అందుకే విద్యార్థులు వ్యతిరేకించాలని చెప్పారు.