Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాజమాన్యాలకు అనుకూలంగా కార్మిక చట్టాల మార్పు
- రాష్ట్రంలో కాలం చెల్లిన వేతన సవరణ జీవోలు
- ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్ముతున్న బీజేపీ
- మరోవైపు ప్రజలను మభ్యపెట్టే దిశగా యాత్రలా..: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు
- కరీంనగర్, మెదక్లో కార్మిక గర్జన పాదయాత్రలు ప్రారంభం
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి/ తూప్రాన్ రూరల్/ మనోహరాబాద్
'కరోనా సమయంలో ప్రజలందరినీ లాక్డౌన్ చేసి.. దొంగచాటుగా బీజేపీ సర్కారు కార్మికుల హక్కులను హరించివేసింది. 29కార్మిక చట్టాలను 4కోడ్లుగా మార్చి వారిని యజమానులకు బానిసలుగా వెట్టిచాకిరీ చేసేలా కుట్ర చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రయివేటుకు తెగనమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం.. ప్రజల జీవన ప్రమాణాలను గాలికొదిలేసింది. రాష్ట్రంలోని టీఆర్ఎస్ సర్కారు ఏడేండ్లుగా కార్మికుల వేతన సవరణ జీవోల ఊసెత్తకుండా కాలం చెల్లిన పాత జీఓలను అమలు చేస్తోంది. దీంతో 73 ప్రధాన పరిశ్రమల్లో కార్మికులకు రూపాయి కూడా జీతం పెరగలేదు..' అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు అన్నారు.
మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కార్మిక గర్జన పాదయాత్ర ప్రారం భమైంది. కరీంన గర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేటలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎడ్ల రమేష్, బండారు శేఖర్, జి.రాజేశం, యు.శ్రీనివాస్, సీహెచ్. భద్రయ్య బృందం పాదయాత్రను సాయిబాబు ప్రారంభించారు.
బ్రిటిష్ పాలకులను ఎదిరించి 1926లోనే కార్మిక చట్టాలను సాధించిన ఘనత దేశ శ్రామికవర్గానిదని గుర్తు చేశారు. 1992లో యాజమా న్యాలు కార్మికులకు హక్కులు తగ్గించాలని సుప్రీంకోర్టుకు వెళ్లినా.. ధర్మాసనం కార్మికుల పక్షాన నిలిచిన విషయాన్ని వివరించారు. ఇలా ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, కనీస వేతనం, పని గంటలు వంటి హక్కులను పోరాడి సాధించుకున్నారని తెలిపారు. పక్కనున్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, బర్మా వంటి దేశాల్లో లీటరు పెట్రోలు రూ.60 కూడా దాట లేదని, దేశంలో మాత్రం వంద రూపాయలు దాటిందని ఆవేదన వ్యక్తం చేశారు. పన్నుల రూపంలో ప్రజల నడ్డి విరుస్తూ కేంద్రం, రాష్ట్రం ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నాయని విమర్శించారు.
ఇప్పటికే నిత్యా వసర సరుకుల చట్టాన్ని మార్చి ప్రజల ఆహార భద్రతకు భంగం కలిగించారని వివరిం చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వాలు సవరించిన వేతన సవరణ జీవోలే ఇప్పటికీ రాష్ట్రంలో అమలు అవుతున్నాయని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం హామీ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి పరిశ్రమల సాధనకు టీఆర్ఎస్ సర్కారు ఏ మాత్రమూ కృషి చేయడం లేదన్నారు.
ఈ విషయంలో బీజేపీ ఎంపీలు సైతం నోరు మెదపడం లేదు కానీ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బయలుదేరారని ఎద్దేవా చేశారు. అక్టోబర్ 8న కార్మికుల దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
లేబర్ కోడ్లను రద్దు చేయాలి
కొట్లాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రం తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నదని.. నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ డిమాండ్ చేశారు. సీఐటీయూ మెదక్ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షులు ఏ.మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక గర్జన పాదయాత్రను మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో ప్రారంభించారు.