Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నష్టాల్లో ఉన్నాం... తప్పదు..
- ముఖ్యమంత్రికి అధికారుల మొర
- ప్రతిపాదనలు ఇవ్వండి.. క్యాబినెట్లో పరిశీలిస్తాం : సీఎం కేసీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ, కరెంటు చార్జీలు పెంచుకొనేందుకు అనుమతి ఇవ్వాలని ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఇస్తే, వచ్చే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ఆర్టీసీ, విద్యుత్ శాఖలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె తారకరామారావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్, టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ ప్రభాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్‌శర్మ, ఆర్ధికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకష్ణారావు తదితరులు పాల్గొన్నారు. తొలుత ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. రవాణామంత్రితోపాటు అధికారులు ప్రస్తుతం ఆర్టీసీ స్థితిగతులను ముఖ్యమంత్రికి వివరించారు. డీజిల్ భారం మోయలేకున్నామనీ, చార్జీలు పెంచడం తప్ప, మరో ప్రత్యామ్నాయం లేదని చెప్పుకొచ్చినట్టు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రకటనలో పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న ఆర్టీసీ ప్రభుత్వ చర్యలతో గాడిన పడుతుందని ఆశిస్తున్న సమయంలో కరోనా, లాక్డౌన్, డీజిల్ ధరల పెంపు వల్ల మళ్లీ ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు గణాంకాలతో ఆర్టీసీ భారాలను వివరించినట్టు సమాచారం. ఏడాదిన్నర కాలంలో డీజీల్ ధరలు లీటరుకు రూ.22 పెరిగాయనీ, దానివల్ల ఆర్టీసీపై రూ.550 కోట్ల అదనపు భారం పడిందనీ, దానితోపాటు టైర్లు ట్యూబులు తదితర బస్సు విడిభాగాల ధరలు కూడా పెరగడంతో సంస్థ మరింత నష్టాల్లోకి వెళ్లినట్టు వివరించారు. వీటన్నింటి వల్ల దాదాపు రూ.600 కోట్ల అదనపు ఆర్థిక భారాన్ని ఆర్టీసీ మోయవలసి వస్తున్నదని తెలిపారు. దీనికి కరోనా, లాక్డౌన్ తోడవడంతో దాదాపు రూ.3వేల కోట్ల ఆదాయాన్ని నష్ట పోయిందని ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నెలకు రూ.90 కోట్ల నష్టం వస్తున్నట్టు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోలు నష్టాల్లోనే నడుస్తున్నాయన్నారు. అందువల్ల ఆర్టీసీ చార్జీలు పెంచాల్సిన అవసరముందని అధికారులు చెప్పినట్టు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రకటనలో పేర్కొన్నారు. గతేడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచుతామని ప్రకటిందనీ, కరోనా కారణంగా చార్జీలను పెంచలేదని ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి గుర్తుచేశారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ అన్ని రకాల ప్రతిపాదనలతో త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశానికి రావాలనీ, అక్కడే చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
విద్యుత్ చార్జీలు కూడా...
ఇదే సమావేశంలో రాష్ట్రంలో విద్యుత్‌శాఖ పనితీరుపై కూడా సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి, టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ ప్రభాకర్‌రావు విద్యుత్ చార్జీల పెంపును ప్రస్తావించారు. కరోనా నేపథ్యంలో అన్ని రంగాల మాదిరే విద్యుత్ సంస్థలు కూడా పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయని వారు చెప్పారు. ఆరేండ్లుగా విద్యుత్ చార్జీలను సవరించలేదని, ఆ శాఖను గట్టెక్కించడానికి విద్యుత్ చార్జీలు పెంచాలని వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినట్టు సీఎంఓ కార్యాలయ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై కూడా ప్రతిపాదనలతో రావాలనీ, త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.