Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిఘటించిన కాంగ్రెస్ కార్యకర్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద టీఆర్ఎస్వీ మంగళవారం తలపెట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని రేవంత్ ఇంటిని ముట్టడించేందుకు వచ్చిన టీఆర్ఎస్వీ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవటంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు రేవంత్ వైట్ ఛాలెంజ్ (డ్రగ్స్ టెస్ట్) విసిరిన నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం రేవంత్ ఇంటిని ముట్టడించి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు టీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం టీఆర్ఎస్వీ ప్రయత్నించటంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ ఆగకపోగా దాడులు....ప్రతి దాడులతో వారు రెచ్చిపోయారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ జెండాలను లాక్కుని కింద పడేశారు. అనంతరం గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి తదితరులు మాట్లాడుతూ రేవంత్ ఇంటి వద్ద జరిగిన ఘటనపై సీరియస్ అయ్యారు. దాడిని ఖండించారు. టీఆర్ఎస్ దాడి అప్రజాస్వామికమన్నారు. మాదకద్రవ్యాలరహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చాలన్నదే రేవంత్ లక్ష్యమనీ, దీంతో టీఆర్ఎస్ ఉలికిపడుతున్నదని విమర్శించారు. దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు.