Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ప్రమోషన్లలో రిజర్వేషన్లు-సామాజిక న్యాయం' సెమినార్లో నాగటి నారాయణ
- సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో దళితులు మెరుగవ్వాలి
- ప్రయివేటు రంగంలోనూ రిజర్వేషన్లు ఉండాలి
- వాటిని నిర్వీర్యం చేసే యత్నంలో బీజేపీ సర్కారు : జాన్‌వెస్లీ
- ప్రమోషన్లు భిక్ష కాదు..హక్కు : స్కైలాబ్‌బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమాజంలో వివక్ష కొనసాగినంత కాలం రిజర్వేషన్లు ఉండాల్సిందేనని విద్యావేత్త నాగటి నారాయణ అన్నారు. మనువాద శక్తులు అధికారంలో ఉన్న నేపథ్యంలో రిజర్వేషన్లను రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో 'ప్రమోషన్లలో రిజర్వేషన్లు-సామాజిక న్యాయం' అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం నుంచే రిజర్వేషన్లు ఉన్నాయనీ, మొదట రాజ్యాంగంలో చేర్చనప్పటికీ ఆ తర్వాత వాటిని పొందుపర్చారని వివరించారు. సుప్రీం కోర్టులో ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలుపై 132 రకాల పిటిషన్లు ఉన్నాయని చెప్పారు. వీటన్నింటినీ విచారణకు సుప్రీం ధర్మాసనం అంగీకారం తెలిపిందన్నారు. ప్రమోషన్లలో రిజర్వేషన్ విషయంలో సెటిల్ అయిన అంశాలను తిరగదోడొద్దంటూ జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్.గవారులతో కూడిన ధర్మాసనం ఈ నెల 15న వ్యాఖ్యానించిందనీ, తదుపరి విచారణ అక్టోబర్ ఐదో తేదీన ఉందని చెప్పారు. ప్రమోషన్లలో రిజర్వేషన్ ఉండాలని రాజ్యాంగం ఆర్టికల్ 16(4ఏ)లో స్పష్టంగా చెప్పారని వివరించారు. ఎస్సీ, ఎస్టీలకు క్రిమీ లేయర్ వర్తించదని ఇంద్రా సాహ్ని కేసులో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంకటాచలయ్య నేతృత్వంలోని 9 మంది సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం 1992లో ఇచ్చిన తీర్పును గుర్తుచేశారు. రిజర్వేషన్లతో ప్రతిభ, సామర్థ్యం దెబ్బతింటాయనే వాదన పూర్తి అవాస్తమనీ, ఇదే విషయాన్ని 2019లో జస్టిస్. యుయు లలిత్, జస్టిస్ డివై చంద్రచూడ్ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. 'ఇంకా ఎంతకాలం ఈ రిజర్వేషన్లు, 70 ఏండ్లు ఇంకా వదలరా? రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదు. ఎస్సీ, ఎస్టీ జాబితాలు సమీక్షించాలి' అని గతేడాది ఫిబ్రవరిలో జస్టిస్ ఎల్. నాగేశ్వర్రావు, ఏప్రిల్‌లో జస్టిస్ అరుణ్‌మిశ్రా ధర్మసనాలు చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేయాలనే డిమాండ్ సరిగాదనీ, దాని వెనుక రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేసే కుట్ర దాగుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ మాట్లాడుతూ..దేశంలో రిజర్వేషన్ల నిర్వీర్యానికి మోడీ సర్కారు పూనుకున్నదని విమర్శించారు. రాజ్యసభలో, న్యాయమూర్తుల నియామకం, తదితర రంగాల్లో నేటికీ రిజర్వేషన్లు లేవని వివరించారు. ఉన్న హక్కులను కాపాడుకునేందుకు పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు ఉంచకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు బీజేపీ ప్రభుత్వం పూనుకున్నదన్నారు. ప్రయివేటు రంగం, సంక్షేమ పథకాల అమలులోనూ రిజర్వేషన్లు అమలు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతి రంగాల్లో దళితులకు సమాన అవకాశాలు కల్పించాలనే స్పష్టమైన డిమాండ్‌తో కమ్యూనిస్టులు పోరాడుతున్నారన్నారు. అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించి, వివక్షా రూపాలకు అడ్డుకట్ట వేస్తే సమాజం ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు చేయండి..లేకపోతే మాకైనా ఇవ్వండి అనే డిమాండ్ సరిగాదన్నారు. ప్రమోషన్లలో దళితులు, గిరిజనులకు ప్రమోషన్లు సామాజిక న్యాయం తప్ప ఎవరిభిక్ష కాదన్నారు. రిజర్వేషన్ల వ్యతిరేక పార్టీలేవీ, అనుకూలంగా ఏ పార్టీ వారు మాట్లాడుతున్నారనే విషయాన్ని ఎస్సీ, ఎస్టీలు గమనించాలన్నారు. ఈ సమావేశంలో సామాజిక వేత్త డాక్టర్ స్వామి అల్వాల్, రాష్ట్ర నాయకులు ఎం.కురువయ్య, పాలడుగు నాగార్జున, నందిపాటి మనోహర్, అతిమెల మాణిక్యం, ఎ.కుమార్, టి.సురేశ్‌కుమార్, ఆర్.మహిపాల్, కె.మహేశ్, కె.గంగాధర్, ఎం.ముత్తయ్య, లక్ష్మీదేవి, గంగామణి, సాయిలీల, హన్మంతు, శ్రావణ్, కె.యాదగిరి, ఎం.నాగేశ్వర్రావు, పరంజ్యోతి, జి.దేవేందర్, బి.కనకయ్య, విద్యాసాగర్, ఎ.కాశన్న, తదితరులు పాల్గొన్నారు.