Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కోర్టులు ఆదేశిస్తే తప్ప ప్రభుత్వం స్పందించదా? వర్షాకాలంలో దోమలు పెరుగుతాయనీ, జ్వరాలు వస్తాయనీ, చర్యలు తీసుకోవాలంటూ ప్రతియేటా కోర్టులు చెబితేనే అధికారులు పనిచేస్తారా? అని హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సీఎం సమీక్ష చేశారంటే సరిపోదనీ, నిజానికి ఇది సీఎం స్థాయిలో చేయాల్సిన పనులు కాదనీ, అధికారులే చర్యలు తీసుకోవాలని సూచించింది. 'అధికారులకు ముందు చూపు ఉండాలి. వర్షాలు వస్తే దోమలు పెరగకుండా జ్వరాలు రాకుండా ఏం చేయాలో ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకుని అమలు చేయాలి. అవేమీ లేకుండా వర్షాలు వచ్చాక కోర్టు చెబితే స్పందించే తీరు అధికారులకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది.ఈ అంశాలపై ఒక కమిటీ వేయాలని గతంలో ఆదేశించామనీ, ఆ కమిటీ ఉందా? రద్దయ్యిందా? ఏం చేస్తున్నది' అని ప్రశ్నించింది.
కమిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను విషజ్వరాలు రాకుండా తీసుకున్న చర్యలు, వాటి అమలుపై సమగ్ర నివేదిక అందజేయాలని నోటీసులు జారీ చేసింది. అదే విధంగా పిటిషనర్ పవన్‌కుమార్, కోర్టుకు సలహాలిచ్చేందుకు నియమించిన అమికస్‌క్యూరీ సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి కూడా సలహాలేమిస్తారో కూడా చెప్పాలంది. డెంగీ, స్వైన్‌ఫ్లూ, మలేరియా వంటి జ్వరాలపై దాఖలైన పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి వినోద్‌కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది. రాష్ట్రంలో డెంగీ వల్ల ఒక మాసంలో 2500 మంది బాధపడ్డారని పిటిసనర్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
గడువు ఇస్తే పూర్తి వివరాలిస్తామని ఏజీ బీఎస్ ప్రసాద్ తెలిపారు. కమిటీ సమావేశాల్లో ఏ నిర్ణయాలు తీసుకున్నదీ తెలియదని నిరంజన్‌రెడ్డి చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు పైవివరాలు కోరుతూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.