Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఏజీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రవికుమార్
- పోడు సమస్య పరిష్కారానికి అక్టోబర్‌లో కలెక్టరేట్ల ముట్టడి: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విశ్వ ప్రసాద్
- ఆసిఫాబాద్‌లో పెద్దఎత్తున పోడుగర్జన
- పట్టణ ఆదివాసుల సమస్యలు పరిష్కరించాలని ఆదిలాబాద్‌లోనూ ధర్నా
నవతెలంగాణ-ఆసిఫాబాద్, శాంతినగర్
పోడు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రవికుమార్ డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున పోడుగర్జన చేపట్టారు. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ ఎదుట బైటాయించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో సీఎం కేసీఆర్ కాగజ్‌నగర్ పర్యటనలో పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. మూడేండ్లు గడిచినా దానిపై దృష్టి సారించడం లేదన్నారు. సాగుదారులు, ప్రజా సంఘాల నుంచి ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన నామమాత్రంగా ఉప కమిటీ వేశారన్నారు. తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని పోరాటం చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2006 డిసెంబర్ కంటే ముందు నుంచి సాగులో ఉన్న వారికి పట్టాలు అందిస్తామని గతంలోనే చట్టం చేసిందన్నారు. సీఎం కేసీఆర్ ఆ చట్టాన్ని మార్చి 2014 తెలంగాణ సాధన నాటికి సాగులో ఉన్న వారికి పట్టాలు అందిస్తామని చెప్పినా అమలు కావడం లేదన్నారు. కొలాంగొంది వాసులకు పునరావాసం పకడ్బందీగా కల్పించాలని కోర్టు ఆదేశించినప్పటికీ అధికారులు పాటించడం లేదన్నారు. వెంటనే వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయడంతో పాటు పునరావాసం కల్పించాలని, లేదంటే అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని హెచ్చరించారు. పట్టాలు ఇవ్వకుంటే అధికార పార్టీ నాయకులను రోడ్లపై తిరగకుండా అడ్డుకుంటామన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. పోడు సాగుదారులకు మద్దతుగా అక్టోబర్ నెలలో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో సాగుదారులకు రైతుబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అల్లూరి లోకేష్, ముంజం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఓదేలు, నాయకుడు ఆనంద్, టీఏజీఎస్ జిల్లా అధ్యక్షుడు కోట శ్రీనివాస్, కార్యదర్శి రాజు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్యామ్‌రావు, గొడిసెల కార్తీక్ పాల్గొన్నారు.
పట్టణ ఆదివాసుల సమస్యలు పరిష్కరించాలని..
ఆదిలాబాద్ పట్టణంలో నివసిస్తున్న ఆదివాసుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీఏజీఎస్(తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు వినతిపత్రం అందించారు.