Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బుధవారం హైదరాబాద్ నుంచి టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. కమిటీల నిర్మాణం, పార్టీ సంస్థాగత కార్యక్రమాలను, గత 20 రోజులుగా పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న స్పందనను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పార్టీ ఆదేశాల మేరకు 12వ తేదీ నాటికి గ్రామ కమిటీలు, గ్రామంలోని అనుబంధ కమిటీల ఏర్పాటు పూర్తయింది. 20 నాటికి మండల కమిటీలు, వాటి అనుబంధ కమిటీల నిర్మాణం పూర్తయింది. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని కేటీఆర్ సూచించారు. ఈ క్రమంలో ఒకట్రెండు రోజుల్లో కమిటీల సమగ్ర సమాచారాన్ని అందిస్తామని ఎమ్మెల్యేలు కేటీఆర్కు తెలిపారు. శుక్రవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల కోసం ఎమ్మెల్యేలంతా హైదరాబాద్కు వస్తారు, కాబట్టి ఆ లోపే కమిటీల నిర్మాణ తుది జాబితాలను పంపాలంటూ ఆయన సూచించారు. జిల్లా కమిటీల ఏర్పాటు, ఆ తర్వాత జరిగే పార్టీ ప్లీనరీ పైన త్వరలో నిర్ణయం తీసుకుంటామని వివరించారు.