Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న రికవరీలు...
- తగ్గుతున్న కొత్త కేసులు
- వారంలో కరోనా కొత్త కేసులు..1704, రికవరీలు...2039
- ఆస్పత్రుల్లో వందల్లోకి తగ్గిన రోగులు
- ఉన్న కేసుల్లో ఎక్కువ సింగరేణి ఆస్పత్రుల్లోనే
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా రెండో దశలో మహమ్మారి తన ప్రతాపాన్ని చూపించింది. అయితే తాజాగా కొత్త కేసులు తగ్గుతూ కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఉపశమనాన్ని కలిగిస్తున్నది. బెడ్లు దొరకని పరిస్థితి నుంచి ప్రస్తుతం ప్రతి రోజూ వస్తున్న కొత్త కేసుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుండటంతో పడకలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కరోనా ప్రత్యేక వార్డుల్లో రోగులు వేల నుంచి వందలకు తగ్గారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ఎక్కువ మంది సింగరేణి ఆస్పత్రుల్లోనే ఉండటం గమనార్హం. కరోనా కేసుల పరంగా చూస్తే గత కొంతకాలంగా అన్ని జిల్లాల్లో కొంచెం అటు, ఇటుగా స్థిరంగా ఉంటున్నాయి. అయితే మిగిలిన జిల్లాల్లో ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందే అవసరం లేకపోయినా సింగరేణి విస్తరించిన ప్రాంతాలు ఆస్పత్రుల్లో మాత్రం రోగులు ఎక్కువగా ఉంటున్నారు.
గత వారం రోజులుగా వస్తున్న కొత్త కేసులు కన్నా రికవరీలు పెరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెల 15న 324 కేసులు రాగా 280 మంది రికవరీ అయ్యారు. 16న 259 కొత్త కేసులొస్తే 301 మంది కోలుకున్నారు. 17న 241 కొత్త కేసులకు గానూ 298 మంది, 18న 255కు గానూ 329 మంది, 19న 173కు గానూ 315 మంది, 20న 208కి గానూ 220, మంగళవారం 244 మంది కొత్తగా వైరస్ బారిన పడగా అప్పటికే దాని నుంచి 296 మంది కోలుకున్నారు. ఈ లెక్కన గత వారం రోజుల్లో 1,704 కొత్త కేసులు రాగా, 2,039 మంది రికవరీ అయ్యారు. అంటే కొత్త కేసుల కన్నా కోలుకున్న వారి సంఖ్య 335 ఎక్కువన్న మాట. దీంతో ఆయా ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య కూడా తగ్గిపోయింది.
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో 831 మంది, ప్రయివేటు ఆస్పత్రుల్లో 1408 మంది చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో చేరిన వారిలో 144 మంది జనరల్ వార్డులో ఉండగా, 333 మంది ఆక్సిజన్, 354 మంది ఐసీయూ వార్డుల్లో ఉన్నారు. రాష్ట్రంలోని 92 ప్రభుత్వాస్పత్రుల్లో కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా బెడ్లు ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని ఆస్పత్రులకే రోగులు పరిమితమయ్యారు. ముఖ్యంగా సింగరేణి కంపెనీ కాలరీస్ లిమిటెడ్ ప్రాంతంలోని ఆస్పత్రుల్లో జనరల్ వార్డుల్లో దాదాపు సగం అంటే 70 మంది ఉన్నారు. మరో 19 మంది ఆక్సిజన్, 22 మంది ఐసీయూ బెడ్లపై ఉన్నారు. వీటితో పాటు రైల్వే, మిలిట్రీ ఆస్పత్రులతో పాటు ఎక్కువగా హైదరాబాద్, కరీంనగర్, నల్లగొండ, వరంగల్ నగర, పట్టణ ప్రాంతాల్లోనే ఆస్పత్రుల్లోనే రోగులుండటం గమనార్హం. సింగరేణి ప్రాంతంలో కార్మికులు వృత్తిరీత్యా శ్వాససంబంధమైన ఇబ్బందులు ఎదుర్కోవటం, రిస్క్ గ్రూపుగా ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఆస్పత్రుల్లో చికిత్సకు సిఫారసు చేస్తుంటామని డాక్టర్లు చెబుతున్నారు. అయితే కేసులు తగ్గుతుండటంతో ప్రజల్లో నిర్లక్ష్యం పెరుగుతున్నదనీ, ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదనీ, అందువల్ల ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు ఎప్పటిలాగే విధిగా పాటించాలని వారు సూచిస్తున్నారు.