Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడు గంటల పాటు నటుడు తరుణ్ విచారణ
- డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసుకు ముగింపు..
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
సినీ నటుడు తరుణ్‌ను దాదాపు ఏడు గంటల పాటు ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం విచారించారు. డ్రగ్స్ , మనీ లాండరింగ్, ఫెమా కేసులో సినీ ప్రముఖులను ఈడీ విచారిస్తున్న విషయం తెలిసిందే. కాగా బుధవారం ఉదయం పది గంటలకే ఈడీ కార్యాలయానికి చేరుకున్న తరుణ్‌ను అర్థగంట తర్వాత ఈడీ అధికారులు విచారించడం ప్రారంభించారు. ముఖ్యంగా డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో తరుణ్‌కు ఉన్న సంబంధాలు మొదలుకుని అతని నుంచి డ్రగ్స్ సేకరణ కోసం డబ్బులను ఏ విధంగా చెల్లించే వారు తదితర కోణాలలో ఈడీ విచారణ సాగినట్టు తెలిసింది. ముఖ్యంగా తరుణ్‌కు చెందిన బ్యాంకు అకౌంట్లను దగ్గర ఉంచుకుని వాటి ద్వారా కెల్విన్ అకౌంట్‌కు ఏ మేరకు డబ్బులు బదిలీ అయ్యాయి. ఇంకా వేరే విదేశీ అకౌంట్లకు డబ్బులు వెళ్లయా.. అనే దిశగా కూడా ఈడీ అధికారులు తరుణ్‌ను ప్రశ్నించారని తెలిసింది. కెల్విన్ డ్రగ్స్ సరఫరాకు కేంద్రంగా ఈడీ అనుమానిస్తున్న ఎఫ్‌క్లబ్‌తో తరుణ్‌కు ఉన్న సంబంధాల గురించి కూడా అధికారులు ప్రశ్నించారు. దాదాపు ఏడు గంటల పాటు తరుణ్‌ను విచారించాక ఈడీ కార్యాలయం నుంచి ఆయన వెళ్లిపోయారు. తరుణ్ విచారణతో టాలీవుడ్‌కు చెందిన కొందరు సినీ ప్రముఖులపై మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఆరోపణలపై ఈడీ జరుపుతున్న విచారణ ముగిసినట్టయింది. గత ఆగస్టు 31వ తేదీ నుంచి ఇప్పటి వరకు 12 మంది సినీ ప్రముఖులును ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఇందులో దర్శకుడు పూరీ జగన్నాధ్, నటీమణులు చార్మీ, రకుల్ ప్రీత్‌సింగ్, ముమైత్‌ఖాన్, నటులు నందు, దగ్గుబాటి రాణా, రవితేజ, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, ఎఫ్ క్లబ్ మేనేజర్ హర్‌ప్రీత్‌సింగ్, నవదీప్, తరుణ్‌లు ఉన్నారు. వీరందరిలో దగ్గుబాటి రానా, రకుల్ ప్రీత్‌సింగ్‌లు మినహా మిగతా వారినందరిని గతంలో రాష్ట్ర ఎక్సైజ్ సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అంతేగాక వీరికి డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదంటూ కోర్టులో చార్జిషీట్‌ను కూడా దాఖలు చేశారు . అయితే ఈడీ అధికారులు కెల్విన్‌తో పాటు మరో ఇద్దరిని కూడా విచారించి వారి అకౌంట్ల నుంచి విదేశీ అకౌంట్లకు ఏ మేరకు డబ్బులు బదిలీ అయింది తేల్చే ప్రయత్నం చేశారు. ఒక పక్క 12 మంది సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకోలేదంటూ రాష్ట్ర ఎక్సైజ్ పోలీసులు తేల్చిన నేపథ్యంలో ఈడీ తమ విచారణలో ఎలాంటి నిజాలను బయటపెట్టనున్నారు, మనీ లాండరింగ్‌కు వీరు పాల్పడ్డారా లేదా అనే కోణంలో ఏమైనా ఆధారాలు సేకరించారా లేదా అనే కోణంలో దేనిని ఈడీ అధికారులు నిర్ధారిస్తారు . అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమ వుతున్నాయి. అలాగే వీరి విచారణతోటే ఈడీ దర్యాప్తు ముగుస్తుందా లేక మరెవరినైనా నోటీసులు ఇచ్చి పిలుస్తారా అనే అనుమానాలు కూడా లేకపోలేదు.