Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ వాహనం ముందు ధర్నా
నవతెలంగాణ - జైనూర్
మోడల్ స్కూళ్లలో వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని తుడుందెబ్బ విద్యార్థి సంఘం, ఏజెన్సీ షెడ్యూల్ కులాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండల కేంద్రంలో మోడల్ స్కూల్ ఎదుటనున్న ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఇదే సందర్భంలో వచ్చిన జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ వాహనం ముందు బైటాయించారు. ఆయన హామీ మేరకు వినతిపత్రం అందజేసి ధర్నా విరమించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ మండలాధ్యక్షులు ధర్మారావు, ఏజెన్సీ షెడ్యూల్ కులాల జేఏసీ జిల్లా అధ్యక్షులు సుద్దాల శ్రీనివాస్ మాట్లాడారు. జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, కెరమెరి మండలాలకు ఏకైక మోడల్ స్కూల్ సిర్పూర్(యు) మండల కేంద్రంలో ఉందన్నారు. కరోనా కారణంగా 18 నెలల నుంచి విద్యార్థులు విద్యకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. ఇటీవల నాన్ రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించారనీ, కానీ ఉపాధ్యాయులు లేక విద్యార్థులు వచ్చిపోతున్నారన్నారు. 9 నెలల నుంచి మోడల్ స్కూల్ పాఠశాల హెచ్‌బీటీ ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ఉపాధ్యాయుల ఉద్యోగాన్ని రెన్యువల్ చేయకపోవడంతో విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుల నియామకానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనతో సుమారు అరగంట పాటు రాకపోకలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యాకమిటీ చైర్మెన్ అడ అమృతరావు, అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ నాయకులు కామ్లె అశోక్, అంబేద్కర్ పూలే మహాజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండగుల మహేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆనంద్, తుడుందెబ్బ అధ్యక్ష కార్యదర్శులు మాధవరావు, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.