Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి కార్మికుడికి 250 గజాల భూమి పట్టా ఇవ్వాలి
- కొత్తగూడెం చేరుకున్న కార్మిక పోరు యాత్ర
- సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) :
- రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.రాజారెడ్డి,
మందా నర్సింహారావు
- పోరుయాత్ర జీపు జాతాకు బ్రహ్మరథం-బైక్ ర్యాలీలు
నవతెలంగాణ-కొత్తగూడెం/సత్తుపల్లి
సింగరేణి సంస్థలో 30 ఏండ్లు రక్తాన్ని ధారబోసి సంస్థ అభివృద్ధికి పాటు పడి రిటైర్డయిన కార్మికునికి సొంత ఇల్లు కరువయిందనీ, సింగరేణి యాజమాన్యం ప్రతి కార్మికుడికి 250 గజాల భూమి పట్టా ఇవ్వాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.రాజారెడ్డి, మందా నర్సింహారావు డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల పోరుయాత్ర బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగింది. జీపు జాతాకు కార్మికులు పెద్ద ఎత్తున స్వాగతాలు పలికారు. ప్రజా నాట్యమండలి కళాకారులు ఆలపించిన కార్మిక చైతన్య గీతాలు అందరిని అలరించాయి. కార్మికులు మైన్స్ ఏరియాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్మిక పోరు యాత్ర సందర్భంగా సింగరేణి సెంట్రల్ వర్క్‌షాప్, మెయిన్స్టోర్, సింగరేణి ప్రధాన ఆస్పత్రి, సత్తుపల్లి జేవీఆర్ ఓసీలు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆయాకేంద్రాల్లో జరిగిన సభల్లో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధుతో కలిసి వారు మాట్లాడారు. 70 ఏండ్ల కిందట నిర్మించిన సింగరేణి క్వార్టర్స్ కూలడానికి సిద్ధంగా ఉన్నాయని వాపోయారు. వాటికి ఎన్ని మరమ్మతులు నిర్వహించినా ఫలితం లేదన్నారు. ఆ నివాసగృహాల్లో ఉండటం వల్ల ఏడాదికి లక్షలాది రూపాయలు కార్మికులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు మాత్రం మెరుగైన సౌకర్యాలతో నివాసగృహాలు ఇస్తున్నారని తెలిపారు. ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్స్‌ను కాంట్రాక్ట్ కార్మికులకు కేటాయించాలని కోరారు. కొత్త బొగ్గు గనులు ప్రారంభించి నిరుద్యోగ యువతకు ఉపాధి ఆవకాశాలు కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బయ్యారం స్టీల్ ప్లాంట్‌ను వెంటనే ప్రారంభించాలని చెప్పారు. సీఎం కేసీఆర్ కార్మికులకు ఒక సంవత్సరం ఉద్యోగ విరమణ వయసు పెంచినప్పటికీ ఎలాంటి లాభం లేదన్నారు. సింగరేణి సంస్థకు బకాయి ఉన్న రూ.12 వేల కోట్లు ప్రభుత్వం తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనాతో మృతి చెందిన కార్మికులకు రూ. 15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలనీ, సకాలంలో కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు ఇవ్వాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ రానున్న రోజుల్లో భారీ ఎత్తున పోరాటాల రూపకల్పనకు శ్రీకారం చుట్టిందనీ, కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ మాట్లాడారు. ఈ యాత్రలో కొత్తగూడెం సింగరేణి బ్రాంచ్ అధ్యక్షులు విజయ గిరి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు యర్రగాని కృష్ణయ్య, సత్తుపల్లి జేవీఆర్ ఓసీ కార్యదర్శి కె.రమణ, కిష్టారం ఓసీ కార్యదర్శి ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.