Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగ్రోటెక్ కార్యాలయం ఎదుట రైతుల నిరసన
నవతెలంగాణ-ఆర్మూర్
ఎర్రజొన్నల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ రైతులు ఆర్మూర్ నుంచి అర్గుల్ వైపు వెళ్లే రహదారి పక్కన గల నరసింహ ఆగ్రోటెక్ కార్యాలయ ఎదుట వంటావార్పుతో బుధవారం నిరసన చేపట్టారు. కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో తాళం పగులగొట్టారు. అనంతరం 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ టీసీ సాయన్న, రైతులు మాట్లాడుతూ.. ఆరేండ్ల కిందట గ్రామానికి చెందిన ఎర్రజొన్నల రైతులు పంటను పట్టణానికి చెందిన నరసింహ ఆగ్రోటెక్ వ్యాపారి నరోత్తంరెడ్డికి విక్రయించామని తెలిపారు. అప్పటినుంచి ఆయన తమ పంట డబ్బులు చెల్లించలేదని వాపోయారు. డబ్బులు ఇవ్వాలని నిలదీస్తే నరసింహ ఆగ్రోటెక్ ముందుభాగం గల 400 గజాల స్థలాన్ని బాండ్ పేపర్తో బకాయి కింద రాసిచ్చాడని తెలిపారు. కానీ ఆ స్థలాన్ని తమకు తెలియకుండా ముప్కాల్ గ్రామానికి చెందిన రాజారెడ్డి పేరుపై చేయించారని వివరించారు. ఎర్ర జొన్న పంటకు సంబంధించి రూ.59లక్షలు నేటికీ చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించేంతవరకూ కార్యాలయం ఎదుట గుడిసెలు వేసుకొని నిరసన తెలుపుతామని హెచ్చరించారు. జక్రాన్పల్లి ఏఎస్ఐ అక్కడికి చేరుకుని సర్ధిచెప్పడంతో ఆందోళన విరమించారు.