Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 140 మంది పిల్లలకు నేటికీ అందని పరిహారం
- త్రిసభ్య కమిటీ ముందు గోడువెల్లబోసుకున్న 'గౌరవెల్లి' భూ నిర్వాసితులు
నవతెలంగాణ- హుస్నాబాద్‌రూరల్
'మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ప్రాజెక్ట్ పనులు చేపడుతున్నారు. మొదటి సారి భూములు కోల్పోయిన వారికి పూర్తిస్థాయి నష్టపరిహారం రాకముందే ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని పెంచారు.. భూ నిర్వాసితుల పిల్లలకు ఇవ్వాల్సిన పరిహారంలో 140 మందికి నేటికీ అందలేదు. మాకు న్యాయం జరిగిన తరువాతనే ప్రాజెక్ట్ పనులు చేపట్టాలి' అంటూ గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులు.. త్రిసభ్య కమిటీ ముందు తమ గోడును వెల్లబోసుకున్నారు. సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతి లేకుండా పనులు జరుగుతున్నాయనీ, 1.41 టీఎంసీలు ఉన్న సామర్థ్యాన్ని 8.23 టీఎంసీలకు పెంచారంటూ గూడాటిపల్లి గ్రామ సర్పంచ్ బద్దం రాజిరెడ్డి ఆధ్వర్యంలో గతంలో ఎన్జీటీలో పిటిషన్ దాఖలైంది. విచారణలో భాగంగా గౌరవెల్లి జలాశయంను జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు కమిటీ సభ్యులు జీఆర్ఎంబీ మెంబర్ పీఎస్.కుటియాల్, డైరెక్టర్(హైదరాబాద్) రమేష్ కుమార్, సైంటిస్ట్ ఇంటిగ్రేటడ్ సీసీ హైదరాబాద్, డాక్టర్ ఈ అరోకియా లెనిన్లు బుధవారం గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించారు. కాగా తమను ఎన్నో ఇబ్బందులు పెట్టుకుంటూ రీ డిజైనింగ్‌తో ప్రాజెక్టు పనులు కొనసాగిస్తున్నారని భూ నిర్వాసితులు కమిటీకి తమ గోడును విన్నవించారు. నిర్వాసితులకు ఇంటి స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కేటాయించలేదని వాపోయారు. ప్రాజెక్టును రీ డిజైనింగ్ చేసిన తర్వాత, నష్ట పరిహారం చెల్లించకుండా రోడ్లు మూసివేశారనీ, అడ్డుకుంటే.. నిర్వాసితులపై కేసులు పెట్టారని వివరించారు. పర్యావరణం, అటవీశాఖ అనుమతులు తీసుకోకుండా పనులు చేస్తూ నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈనెల 30లోపు ట్రిబ్యునల్‌కు కమిటీ నివేదిక ఇవ్వనుంది. అనంతరం త్రిసభ్య కమిటీ గౌరవెల్లి ప్రాజెక్టు, పంప్ హౌస్ ప్రాజెక్టును పరిశీలించారు. త్రిసభ్య కమిటీ సభ్యుల వెంట ఆర్డీఓ జయచంద్రారెడ్డి, ఈఈ రాములు నాయక్ తదితరులు ఉన్నారు.