Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోలార్‌లో 200 మెగావాట్ల మైలురాయి దాటిన సింగరేణి
- సింగరేణి డైరెక్టర్లు ఎన్.బలరామ్, డి.సత్యనారాయణరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి సంస్థ ఏర్పాటు చేస్తున్న 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్లలో ఇప్పటికే 172 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం పూర్తయి విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా, కొత్తగూడెంలో నిర్మించిన 37 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌తో 200 మెగావాట్ల మైలురాయిని విజయవంతంగా దాటిందని సింగరేణి సంస్థ డైరెక్టర్ ఫైనాన్స్, పీఅండ్‌పీ ఎన్.బలరామ్, ఈఅండ్ఎం డైరెక్టర్ డి.సత్యనారాయణ రావు తెలిపారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పెనుబల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన 37 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను వారు ప్రారంభించారు. సింగరేణి రుద్రంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ సిహెచ్. నర్సింహారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాటాడారు. పర్యావరణహిత చర్యల్లో భాగంగా వ్యాపార విస్తరణను దృష్టిలో పెట్టుకొని సోలార్ ప్లాంట్లను సింగరేణి సంస్థ నెలకొల్పుతోందన్నారు. ఏడాదికి సుమారు రూ.120 కోట్ల ఆదా చేయనున్నామని చెప్పారు. 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను సింగరేణి వ్యాప్తంగా ఉన్న 8 ఏరియాల్లో వివిధ సామర్థ్యాలు గల 13 ప్లాంట్లను నెలకొల్పాలని సంస్థ నిర్ణయించిందన్నారు. మొదటి దశలో 129 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పాదన కోసం నాలుగు ఏరియాల్లో ప్లాంట్ల నిర్మాణపు పనులను బీహెచ్ఈఎల్కు అప్పగించిందని తెలిపారు. ఆర్జీ-3లో 40, ఇల్లందులో 39, మణుగూరు 30, ఎస్టీపీపీ ఆవరణలో 10 మెగావాట్ల ప్లాంట్స్ నిర్మాణాలు పూర్తయి విద్యుత్ ఉత్పాదన చేస్తున్నాయనీ, మిగిలి ఉన్న 10 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం మరో నెలలో పూర్తి కానున్నట్టు తెలిపారు. కాగా రెండో దశలో 90 మెగావాట్ల సామర్థ్యంతో 3 ఏరియాల్లో నాలుగు చోట్ల ప్లాంట్లను నిర్మించడం కోసం అదానీ సంస్థకు కాంట్రాక్టు అప్పగించినట్టు చెప్పారు. కొత్తగూడెంలో 37 మెగావాట్లు, మందమర్రి-ఏ బ్లాక్‌లో 28, బీ బ్లాక్‌లో 15, భూపాలపల్లిలో 10 మెగావాట్ల నిర్మాణం పూర్తి కాగా విద్యుత్ ఉత్పాదన ప్రారంభమైందని తెలిపారు. దాంతో సింగరేణి సోలార్ ఉత్పాదన 209 మెగావాట్లకు చేరిందని తెలిపారు. కార్యక్రమంలో సింగరేణి సోలార్ ప్లాంట్ డైరెక్టర్ సత్యనారాయణరాజు, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు ఎండీ.రజాక్, ఏరియా సివిల్ జీఎం సూర్యనారాయణ, వర్క్‌షాప్ జీఎం ఎన్.నాగేశ్వరరావు, ఏరియా అధికారులు శ్రీరమేష్, జానకి రామ్, విశ్వనాధరాజు, తదితరులు పాల్గొన్నారు.