Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చాలదన్నట్టు బీమా క్లెయిమ్‌లు
- తిరస్కరిస్తున్న ప్రయివేటు సంస్థలు
- పాలుపోని స్థితిలో బాధితులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా జనసామాన్యానికి మహమ్మారి. కానీ కార్పొరేట్ ఆస్పత్రులకు కాసుల వర్షం కురిపించే వరప్రదాయని. కరోనా మొదటి వేవ్‌లో ప్రభుత్వాస్పత్రులకే పరిమితమైన చికిత్సకు తమకు కూడా అనుమతించాలంటూ ప్రయివేటు ఆస్పత్రులు కోర్టు తలుపులు తట్టాయి. అనుమతి పొంది కాచుకుని కూర్చున్న ఆస్పత్రుల సెకెండ్ వేవ్ తమ వికృత రూపాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. వేల రూపాయలు కూడా ఖర్చు కాని కరోనాకు లక్షల రూపాయలు వసూలు చేస్తుండటంతో పలు ఆస్పత్రులపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బీమా సౌకర్యం ఉన్నప్పటికీ నగదు చెల్లింపులు చేస్తేనే చేర్చుకుంటామంటూ షరతులు విధించటంతో అత్యవసర పరిస్థితుల్లో చేరిన రోగులు ప్రస్తుతం కార్పొరేట్ ఆస్పత్రులు - ప్రయివేటు బీమా కంపెనీల మధ్య చక్కర్లు కొడుతున్నారు.
కరోనా నుంచి కోలుకున్న చికిత్స కోసం పెట్టుకున్న ఖర్చును తిరిగి పొందలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో కరోనా నేపథ్యంలో ప్రయివేటు బీమా కంపెనీలు పాలసీల కోసం ఎగబడ్డాయి. తమ ఆరోగ్య పాలసీలో కరోనా కూడా ఉందని చెప్పడంతో ఎక్కువగా మధ్య తరగతి ప్రజలు బీమా సౌకర్యం పొందారు. ఒకవైపు ప్రభుత్వాస్పత్రులు నిండిపోవటం, అత్యవసర పరిస్థితుల్లో ప్రయివేటును ఆశ్రయిస్తే తడిచి మోపడవుతుందని ఆందోళనకు గురైన ప్రజలతో బీమా కంపెనీలు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నాయి. అయితే పాలసీ చేయించుకున్నప్పుడు చూపిన ఆసక్తిని ప్రయివేటు బీమా కంపెనీలు తిరిగి చెల్లింపులు చేయాల్సిన సమయంలో ప్రదర్శించటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అత్యవసర పరిస్థితిని నిర్ణయించేది ఎవరు?
ఆక్సిజన్ స్థాయి మొదలు పలు విషయాల్లో ప్రజలను ఆందోళనకు గురి చేయటం ద్వారా కార్పొరేట్ ఆస్పత్రులు రోగులను చేర్చుకున్నారు. లక్షలాది రూపాయలను వారి నుంచి వసూలు చేశారు. ఇంటి వద్ద వైద్యం సాధ్యం కాదని డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. డయాబెటీస్, బీపీ, కిడ్నీ సంబంధ వ్యాధులు, శస్త్రచికిత్సలు చేయించుకున్న తర్వాత కరోనా సోకిన వారి విషయంలో అయితే చెప్పక్కర్లేదు. స్పెషాలిటీ డాక్టర్లకు అందుబాటులో ఉండాలనడంతో బాధితులతో ఆ ఆస్పత్రులు కిక్కిరిసాయి. అయితే ముందుగా నగదు చెల్లించి తర్వాత బీమా క్లెయిమ్ చేసుకోవచ్చనుకున్న చాలా మంది రోగులకు నిరాశ ఎదురవుతున్నది. బీపీ, ఆక్సిజన్ స్థాయి సాధారణంగా ఉన్నాయనీ, ఆస్పత్రిలో చేరి చికిత్స పొందే అవసరం కనిపించటం లేదంటూ బీమా కంపెనీలు తిరస్కరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విషయాన్ని చికిత్స పొందిన ఆస్పత్రిలో అడిగితే అత్యవసరం గనుకే చేర్చుకున్నామని చెబుతున్నట్టు బాధితులు వాపోతున్నారు. కరోనా వదిలినా....కార్పొరేట్ ఆస్పత్రులు, ప్రయివేటు బీమా కంపెనీలు మాత్రం వారిని వేధిస్తూనే ఉన్నాయి. ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తే తప్ప ప్రజలకు ఈ బాధలు తప్పేలా కనిపించటం లేదు.