Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మరో మహౌద్యమానికి శ్రీకారం జరిగింది. 2000 సంవత్సరంలో సమైక్య రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన ప్రజాఉద్యమం తర్వాత ఆ స్థాయిలో ప్రతిపక్షపార్టీలన్నీ ఏకమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధాన నిర్ణయాలపై గళమెత్తిన చారిత్రక ఘట్టం బుధవారం ఇందిరాపార్కు వద్ద ఆవిష్క్రుతమైంది. విద్యుత్ ఉద్యమం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని 15 ఏండ్లకు పైగా అధికారానికి దూరం చేసింది. ఆ ఉద్యమం తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో తిరిగి ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఏడున్నరేండ్ల తర్వాత తిరిగి అదే స్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన గళం పెల్లుబికింది. భవిష్యత్‌లో ఇది మరింత ఉధృతరూపం దాల్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. చట్టసభల్లో అధికార, సంఖ్యాబలంతో విర్రవీగుతున్న పాలకులను తిరిగి రోడ్లపై నిలబెట్టే దిశగా ప్రజా ఉద్యమాలకు రూపకల్పన జరుగుతున్నది. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అన్న బీజేపీ ఇప్పుడు బిత్తరచూపులు చూస్తున్నది. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒక తానులోని ముక్కలేనని ప్రజలకూ అర్థమవుతున్నది. సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీకి మొక్కొచ్చిన ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వ పాలనా సంస్కరణల అమలు పేరుతో ప్రజలపై భారాలు వేస్తూనే ఉన్నారు. తాజాగా కరెంటు, ఆర్టీసీ బస్సు చార్జీల పెంపునకు కసరత్తు ప్రారంభమైంది. ఈ దశలో ప్రజా ఉద్యమాలు విస్త్రుతమైతే కచ్చితంగా పాలకవర్గం వెనుకడుగు వేయకతప్పని పరిస్థితి కనిపిస్తున్నది. బుధవారం ఇందిరాపార్కు వద్ద జరిగిన మహాధర్నాకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఓవైపు భారీ వర్షం. అయినా వేదిక వద్ద నుంచి అంగుళం కదలకుండా కూర్చున్నారు. అన్ని ప్రతిపక్షపార్టీల జెండాలన్నీ ఒకే వేదికపై కనిపించి, చలిచీమల సత్తాను చాటాయి. పాలకవర్గాల హాలాహల నిర్ణయ విధ్వంసాన్ని నినదించాయి. చంటిపిల్లల్ని ఎత్తుకున్న తల్లులు, మూడు చక్రాల బండ్లపై వచ్చిన దివ్యాంగులు, రైతు కూలీలు, తలకు కండువాలు చుట్టిన కర్షకులు, లాల్ సలాం అంటూ ఎర్రచొక్కాలతో వచ్చిన కార్మికులు, పోరాటానికి వయసుతో ఏం పని అంటూ ఉత్సాహంగా వేదికముందు కూర్చున్న సీనియర్ సిటిజన్లు...ప్రకృతి ప్రకోపించినా, పంతం వీడని యువకుల నినాదాలతో సభాస్థలి దద్ధరిల్లింది. కరోనాతో కుదేలైన జీవితాల్లో మహాధర్నా మనోనిబ్బరాన్ని నింపే ప్రయత్నం చేసింది. భవిష్యత్‌పై ఆశల్ని సజీవం చేసింది.