Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మె పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎం.సాయిబాబు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
షెడ్యూల్డు పరిశ్రమల జీవోలను సవరించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు డిమాండ్ చేశారు. ఆ సంఘం అక్టోబర్ 8న నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మె పోస్టర్‌ను బుధవారం ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కారు ఏడేండ్లలో 73 షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాలకు సంబంధించిన కొత్త జీవోలను విడుదల చేయకుండా కోట్లాది మంది కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. ఈ పరిశ్రమల్లో ప్రతి ఐదేండ్లకు ఒకసారి జీవోలను సవరించాలనీ, 2006 నుంచి కొన్ని జీవోలను సవరించాల్సి ఉందని తెలిపారు. సవరణ జాప్యంతో బీడీ, బిల్డింగ్, ప్రయివేటు ట్రాన్స్ పోర్ట్, పవర్ లూమ్, చేనేత, రైస్ మిల్లులు, ఇంజినీరింగ్, ఫార్మాసూటికల్, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు, ప్రింటింగ్ ప్రెస్‌లు , షాపింగ్ మాళ్లు, ప్రయివేటు స్కూళ్లు, ప్రయివేట్ నర్సింగ్ హౌంలు, సెక్యూరిటీ సర్వీసులు, ఇండ్లలో పని చేసే వారికి అన్యాయం జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవోల విడుదలతో ఖజానాపై నయాపైసా భారం పడదనీ, కోట్లాది మంది కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. వలస కార్మికుల జీవితాలు మరింత అధ్వాన్నంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరుకు గదుల్లో నిర్బంధించి 12 గంటలు వారితో పని చేయిస్తున్నా కార్మికశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించకుండా యాజమాన్యాలకే కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే కనీస వేతనాలు సవరించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ పాదయాత్రలు, జీపు జాతాలు నిర్వహించిందనీ, టోకెన్ సమ్మెలో కార్మిక సంఘాలతో నిమిత్తం లేకుండా కార్మికులు, కార్మిక సంఘాలు పోరాటంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.రాఘవరావు, ఎ.నాగేశ్వరరావు, కూరపాటి రమేష్, యాటల సోమన్న, పి.శ్రీకాంత్ పాల్గొన్నారు.