Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్వైజరీ కమిటీ నియమించాలి
- కార్మిక మంత్రి మల్లారెడ్డికి వినతిపత్రం అందజేసిన బీసీడబ్ల్యూయూ నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన సివిల్ సప్లరు శాఖకు తరలించిన రూ.1004 కోట్లను వెంటనే తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో జమచేయాలనీ, బోర్డుకు అడ్వైజరీ కమిటీని నియమించాలని తెలంగాణ బిల్డింగ్, అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ ఫెడరేషన్ (బీసీడబ్ల్యూయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగూరు రాములు, ఆర్.కోటం రాజు, కోశాధికారి ఎస్.రామ్మోహన్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అక్టోబర్ 4న హైదరాబాద్లోని కార్మిక శాఖ భవనం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు బోయినపల్లిలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. వెల్ఫేర్ బోర్డులోని 36 వేల పెండింగ్ క్లైమ్స్ను పరిష్కరించి తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న ఏఎల్ఓ, ఏసిఎల్, డిసిఎల్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్స్ పోస్టులను భర్తీ చేయాలని విన్నవించారు. వెల్ఫేర్ బోర్డులో పేరు నమోదుకు రేషన్ కార్డు తప్పకుండా ఉండాలనే నిబంధన తొలగించాలన్నారు. కరోనా సమయంలో బోర్డు కార్డు రెన్యూవల్ చేసుకోని కార్మికులకు కూడా నష్టపరిహారాలు అందించేలా చూడాలని కోరారు. జీహచ్ఎంసీ పరిధిలో సెస్సు వసూలు చేయని అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సెస్సు బకాయిలను వెంటనే వసూలు చేయాలని కోరారు. వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధులను కొత్త స్కీంలు ప్రకటించి కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలన్నారు. 60 ఏండ్లు పైబడిన వారికి నెలకు రూ.5 వేలు పెన్షన్ ఇవ్వాలనీ, కార్మికుల పిల్లల చదువులకు స్కాలర్షిప్స్, కార్మిక అడ్డాల్లో షెడ్లు, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రస్తుతం ఇస్తున్న స్కీంలకు నిధులు పెంచాలనీ, ప్రమాద మరణానికి రూ.10 లక్షలు, సహజ మరణానికి రూ.5 లక్షలు, పెండ్లి, ప్రసూతి కానుక రూ.1 లక్షకు పెంచాలని కోరారు. నాలుగు లేబర్ కోడ్లను కేంద్రం రద్దు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు.