Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంపై హైకోర్టు సీరియస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కోవిడ్ విలయ తాండవం చేస్తుంటే ఇప్పటి వరకూ అత్యవసర ముందుల లిస్ట్‌ను ఎందుకు ప్రకటించలేదని రాష్ట్ర హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 'ఎంతోమంది అమాయక జనం కోవిడ్ మృత్యు కౌగిలికి చేరుకున్నారు. రెండేండ్లుగా ఈ విధంగా జరుగుతున్నా ఇప్పటి వరకూ ఆ లిస్టును ప్రకటించే తీరికా, తీరుబడి మీకు లేదా...?' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మందుల లిస్ట్ అందింది, దానిపై కేంద్ర ఆరోగ్య, ఔషద శాఖ నిర్ణయ తీసుకోవాల్సి ఉందంటూ కాలయాపన చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. ఆ జాబితాను 2015లో జారీ చేశారనీ, కరోనా వ్యాప్తి తర్వాతైనా ఆ లిస్టును సవరించాలని తెలియదా అని ఆక్షేపించింది. కరోనా రెండు విడతల్లో కలిపి ఎంతోమంది బలయ్యారు... అయినా ఇప్పుడు కూడా కేంద్రంలో కనికరం లేకపోతే ఎలాగంటూ ప్రశ్నించింది. ప్రజారోగ్యం అంశంలోనే ఇంతటి అసలత్వముంటే పరిస్థితి ఏం కావాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అత్యవసర మందుల జాబితాను ప్రకటించి తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలతో కూడిన నివేదిక అందజేయాలని పేర్కొంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కోవిడ్ మూడో దశ ముప్పు ఉంటుందంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో ఎంతమంది పిల్లల వైద్యులు ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్నారనే విషయాన్ని ఎందుకు చెప్పడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు ఎక్కువ చేయాలని సూచిస్తే కేవలం పది శాతమే చేశారనీ, ఫలితాలపై అనేక సందేహాలున్నా ఇనిస్టెంట్ ఫలితాలిచ్చే ఆర్ఏటీ పరీక్షలను చేసేందుకే ప్రభుత్వం ఎందుకు ఆసక్తి చూపుతోందని నిలదీసింది. కలర్ కోడెడ్ గ్రేడెడ్ రెస్పాన్స్ (సీజీజీఆర్ఏ) యాక్షన్ ప్లాన్ ఇవ్వకుండా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ సీరియస్ అయ్యింది. వినాయక చవితికి జనం గుమిగూడిన కారణంగా కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలను పరిగణనలోకి తీసుకుని పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించింది. రాబోయే దసరా,దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి వంటి పండుగల వరకూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.
కరోనాపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ వినోద్‌కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోవిడ్ వల్ల ఉపాధ్యాయుడు మరణించినట్టుగా వార్తలొచ్చాయనీ, విద్యా సంస్థలు తెరిచిన నేపథ్యంలో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించింది. పిల్లల నుంచి వేరే వాళ్లకు వైరస్ వ్యాప్తి అవుతుందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారనీ, కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి అన్ని కోణాల్లోనూ చర్యలు తీసుకోవాలని కోరింది. ఆర్టీపీసీఆర్ 10 శాతం, ఆర్ఏటీ పరీక్షలు 90 శాతం చేయడం కాకుండా ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్యనే గణనీయంగా పెంచాలని సూచించింది. మూడూ నెలల్లోగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామంటూ ఏజీ బీఎస్ ప్రసాద్ ఈ సందర్భంగా కోర్టుకు వివరణిచ్చారు. యాక్షన్ ప్లాన్‌ను వచ్చే విచారణ నాటికి అందజేస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీలో టీకాల ప్రక్రియ 97 శాతం పూర్తయిందని చెప్పారు. రాష్ట్రంలో తొలి విడతలో 60 శాతం, రెండు డోస్‌లు కలిపి 38 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని వివరించారు. తొలి విడత వ్యాక్సినేషన్ పూర్తికి 4 వారాలు, రెండు విడతల డోస్‌లు అందరికీ పూర్తి కావాలంటే 3 నుంచి 4 నెలల సమయం పడుతుందని చెప్పారు. విచారణకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్‌రావు ఆన్లైన్లో హాజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ నాలుగుకి వాయిదా వేసింది.