Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేని పక్షంలో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం
- పట్టణంలో చెరుకు రైతుల భారీ ర్యాలీ
- స్వచ్ఛందంగా బంద్ పాటించిన వాణిజ్య, విద్యాసంస్థలు
- కాంగ్రెస్, సీపీఐ(ఎం), పలు ప్రజాసంఘాలు మద్దతు
నవతెలంగాణ-జహీరాబాద్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ట్రైడెంట్ చక్కెర పరిశ్రమను వెంటనే ప్రారంభించాలనీ, లేని పక్షంలో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని చెరుకు రైతులు రాష్ట్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. చక్కెర పరిశ్రమలో క్రషింగ్ ప్రారంభించాలని పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ చెరకు రైతులు బుధవారం బంద్ చేపట్టి నిరసన తెలిపారు. దీనికి పట్టణంలోని అన్ని వాణిజ్య, వ్యాపార సంస్థలతో పాటు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మద్దతు తెలుపుతూ.. స్వచ్ఛందంగా బంద్ పాటించారు. వ్యాపారులు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. కాంగ్రెస్, సీపీఐ(ఎం), బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. దాంతో పట్టణంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఈ సంద ర్భంగా రైతులు.. పస్తాపూర్ చౌరస్తా నుంచి జాతీయ రహదారి గుండా బాగారెడ్డి విగ్రహం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినదించారు. వివిధ మండలాలకు చెందిన ఆయా పార్టీల నాయకులు, చెరుకు రైతులు, ప్రజాప్రతినిధులు మాట్లాడారు. జహీరాబాద్ ప్రాంతంలో దాదాపు 20వేల ఎకరాల్లో 10లక్షల మెట్రిక్ టన్నులకు పైగా చెరకు సాగవుతుందనీ, కానీ స్థానిక ట్రెడెంట్ చక్కెర పరిశ్రమలో రెండేండ్లుగా క్రషింగ్ జరగకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటి కే పలుమార్లు మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. క్రషింగ్ ప్రారంభిస్తామని చెరకు రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో మంత్రి హరీశ్‌రావు, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఎండీ. ఫరీదోద్దీన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకూ చెరకు రైతులకు సకాలంలో బిల్లులు ఇప్పించడం చేతగాక ఫ్యాక్టరీని బంద్ చేయించారని ఆరోపించారు. దళా రుల నుంచి చెరకు రైతులను కాపాడాలంటే కేవలం పరిశ్రమలో క్రషింగ్ ప్రారం భంచడమే మార్గమన్నారు. ఇప్పటికైనా పరిశ్రమ యాజమాన్యం తక్షణమే స్పందించి ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. చెరకును ఇతర పరిశ్రమలకు తరలిస్తే ట్రాన్స్‌పోర్టు, హార్వెస్టింగ్ చార్జీలను ప్రభుత్వమే భరించాలని కోరారు. చెరకు రైతుల బంద్‌తో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసు కోకుండా పోలీసులు పట్టణంలో భారీ ఎత్తున బలగాను మోహరించి బందబస్తు చేపట్టారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. రాంచం దర్, రైతు నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నాగేష్, శ్రీనివాస్, కమలాకర్, భాస్కర్, మల్లేశం, నర్సిములు, సంజీవ్, జహీరాబాద్ ఎంపీపీ గిరిధర్ రెడ్డి, కోహిర్ జడ్పీటీసీ రాందాస్, మాజీ సర్పంచ్, పీఏసీఎస్ చైర్మెన్ బిచ్చిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.