Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలపై పెరుగుతున్న లైంగిక వేధింపులు, దాడులు
- చట్టాలున్నా అమలు కాని దైన్యం
- నేరస్తులకు సకాలంలో శిక్షలుపడని వైనం
- హక్కుల కోసం ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తాం : నవతెలంగాణ ఇంటర్వ్యూలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి
'మహిళలకు సంబంధించి మన పాలకులు బూజు పట్టిన సంస్కృతిని ప్రేరేపిస్తున్నారు... ప్రజల చేత ఎన్నుకోబడి, చట్ట సభల్లో మహిళల గురించి మాట్లాడాల్సిన ప్రజా ప్రతినిధులు, ఎంపీలు, మంత్రులు సైతం ఇదే పద్ధతిలో వ్యవహరిస్తుండటం దారుణం...' అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పట్ల వారికున్న పురుషాధిక్యత భావాజాలం కట్టలు తెంచుకున్న తీరును ఇలాంటి వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయనటంలో ఎలాంటి సందేహమూ అక్కర్లేదని చెప్పారు. ఐద్వాగా మహిళా హక్కుల కోసం నిర్విరామంగా పోరాటాలు నిర్వహిస్తున్నామనీ, పాలకుల నిర్లక్ష్యం, బాధ్యాతారాహిత్యం మూలంగా సాధించుకున్న చట్టాలు కూడా సక్రమంగా అమలు కావటం లేదని ఆమె తెలిపారు. వాటి అమలు కోసం తిరిగి పోరాటాలు నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఐద్వా రాష్ట్ర మూడో మహాసభలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ నెల 24 నుంచి 26 వరకూ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నవతెలంగాణ ప్రతినిధి ఎస్.వెంకన్నకు మల్లు లక్ష్మి ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు..
మహిళలకు సంబంధించిన ఏయే అంశాలపై ఈ కాలంలో
మీ పోరాటాలు, ఆందోళనలు కొనసాగాయి..?
ప్రస్తుత మహిళలు అనేక సమస్యలతో అభద్రతా భావంతో బతుకుతున్నారు. ఇంటా, బయటా శ్రమ దోపిడీకి గురవుతున్నారు. పోరాడి సాధించుకున్న హక్కులను సైతం పాలకులు అమలు చేయటం లేదు. ఈ నేపథ్యంలో వారి హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం ఐద్వా నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నది. డ్వాక్రా రుణాలు, విద్యా, వైద్యం, అభయహస్తం పథకాలను కొనసాగించాలనే డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించాం. క్షేత్రస్థాయిలో వెలుగు చూసిన అనేక సమస్యల పరిష్కారం కోసం ..వాటిని పరిష్కరించేంతవరకూ పోరాటాలు నిర్వహించాం. ప్రభుత్వ బళ్లలో పేద పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం కూడా ఉద్యమాలు నిర్వహించాం. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరతతోపాటు మందులు, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకోసం ఆందోళనలు చేపట్టాం.
మహిళలపై రోజురోజుకు దాడులు, పెరుగుతున్నాయి కదా? వీటిని అరికట్టడం ఎలా?
అటు దేశంలోను, ఇటు రాష్ట్రంలోనూ మహిళలపై దాడులు, దౌర్జన్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో ఏడాదికి సుమారు 35 వేలకు పైగా లైంగిక దాడి కేసులు నమోదవుతున్నాయంటూ ఒక క్రైమ్రిపోర్టు వెల్ల డించడం ఆందోళన కలిగించే అంశం. ఇది నమోదైన కేసుల రిపోర్టు మాత్రమే. ఇక స్టేషన్ మెట్లెక్కని కేసులు ఎన్ను న్నాయో చెప్పలేం. రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి. వీటి నివారణ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామంటూ అక్కడా ఇక్కడా పాలకులు చెబుతూనే ఉన్నారు. కానీ అవి ఎంత మాత్రమూ ఆగటంలేదు. సరికదా ఏడేండ్లకాలంలో మహి ళలపై దాడులు, దౌర్జన్యాలు బాగా పెరిగాయి. మరోవైపు నేరస్థులకు మద్దతుగా ఆధికారగణం ర్యాలీలు తీయడాన్ని చూస్తున్నాం. పైగా ఇలాంటి ఘటనల్లో తప్పుడు భాష్యాలు చెబుతున్నారు. ఫలానా దుస్తులు ధరించడం వల్లనే దాడులు జరుగుతున్నాయంటూ కొందరు మాట్లాడుతున్నారు. మొన్న హైదరాబాద్లోని సింగరేణి కాలనీలో చిన్నారిపై జరిగిన దారుణాన్ని పరిశీలిస్తే ఆపాప వేసుకున్న డ్రస్ ఆ ఘాతుకాన్ని ప్రేరేపించిందా? అంతకు ముందు ఖమ్మంలో జరిగిన ఘటన కూడా కావచ్చు.. ఇలా అనేకం జరిగాయి. ఇలాంటి ఘటనలు, అఘాయిత్యాలు, లైంగిక దాడుల వెనకున్న మూలాలను పట్టుకోవాల్సిన అవసరముంది. వాటి జోలికి పోకుండా నిందితులను హత్యలు చేయడం వల్ల అవి ఆగబోవనే విషయం ఇప్పటికే రుజువైంది. పుంఖాను పుంఖాలుగా బూతు సాహిత్యం, వందల సంఖ్యలో ఫోర్న్సైట్స్, మద్యం, డ్రగ్స్... ఇలా యువత మత్తుకు బానిసలయ్యే అవకాశాలను అరికట్టకుండా ఈ దాడులను నివారించగలమనుకోవటం సరికాదు. మరో పక్క దేశంలో, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. నిరుద్యోగం పెరుగుతున్నది. ఇలాంటి రుగ్మతలతో సమాజం నిండిపోయి ఉంది. వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ ఈ పాలకులు, ప్రభుత్వాలు వాటి జోలికి పోవటం లేదు. పైగా వాటిని ఆదాయ వనరులుగా చూడటం అన్యాయం.
కేంద్రంలోని మోడీ సర్కార్ 'బేటీ బచావో..బేటీ పడావో' అంటోంది కదా..? ఎంతవరకు
ఆ నినాదం సఫలీకృతమైంది...?
ఇప్పుడు మనకు కావాల్సింది నినాదాలు కాదు.. విధానాలు కావాలి. మహిళలను ఉద్ధరిస్తామంటూ నినాదాలివ్వడం కాదు... అవసరమైన విధానాన్ని స్పష్టంగా ప్రకటించాలి. అందుకు తగిన కార్యాచరణను రూపొందించాలి. కేంద్రం ఆ పని చేయడం లేదు.
'బేటీ బచావో..బేటీ పడావో'కు కేటాయించిన బడ్జెట్లో సుమారు 60శాతానికి పైగా మోడీ ప్రచార ప్రకటనలకే సరిపెడుతున్నారు. ఇదినిజం. ఆడపిల్ల చదువుకూ, భద్రతకు దూరమవడానికి కారణమైన విధానాలను మారకుండా ఎన్ని చెప్పినా.. అవి వారి రాజకీయ మైలేజీకే ఉపయోగ పడతాయి తప్పితే..మహిళలకు ఒరిగేదేమీ ఉండదు.
మీ మహాసభల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు..?
సూర్యాపేటలో జరగనున్న ఐద్వా మూడో మహాసభల్లో రాబోయే కాలంలో నిర్వహించాల్సిన పోరాటాల గురించి చర్చిస్తాం. ముఖ్యంగా ఉపాధిహామిని విస్తరింపజేయాల్సిన అవసరంపై చర్చిస్తాం. దీన్ని పట్టణ ప్రాంతాలకు కూడా వర్తింపజేయాలనీ కోరుతున్నాం. ఇందుకోసం రాబోయే రోజుల్లో ఆందోళనలు చేపడతాం. చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ల అమలుపై పోరాటాలకు శ్రీకారం చుడతాం. రోజురోజుకు మహిళల ఉపాధి దెబ్బతింటున్నది. అలాగే పని ప్రదేశాల్లో వేధింపులు, దాడులు కొనసాగుతున్నాయి. అలాగే మైనార్టీ మహిళల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, పొదుపు గ్రూపుల అమలు తీరుపైనా ఉద్యమాలు నిర్వహిస్తాం. అందుకనుగుణంగా మహాసభల్లో కార్యాచరణ రూపొందిస్తాం.