Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు పనికి మాత్రం పైసా కట్టివ్వని వైనం
- ఇచ్చేదే అరకొర వేతనం అందులోనూ కోతే
- పనిప్రదేశాల్లో కనీస సౌకర్యాలు నిల్
- వలస కార్మికుల శ్రమను దోచుకుంటున్న పరిశ్రమలు
- కాలుష్య వ్యర్థాలు రోడ్లపైకే..అంతా బురదమయమే
- 'మినీ ఇండియా' ఐడీఏ బొల్లారంలో కనీస సౌకర్యాలు మృగ్యం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్/ఐడీఏ బొల్లారం
అక్కడ కార్మికులు పరిశ్రమలకు వెళ్లడం ఒక్కనిమిషం లేటైనా దినమంతా పని కోల్పోవాల్సిందే. ఎంత వేడుకున్నా సరే నిష్పప్రయోజనం. వెనక్కి వెళ్లాల్సిందే. సాయంత్రం సమయం అయిపోయినా సరే అదనంగా పనిచేయాల్సిందే. ఓటీ ఏమైనా ఇస్తున్నారా? అంటే అదీ లేదు. ఇచ్చే అరకొర వేతనంలోనూ సెలవుల పేరిట దారుణంగా కోతలు. పనిప్రదేశాల్లో కనీస సౌకర్యాలు అంతంతే. లాభాలు తప్ప ఇంకేమీ పట్టని యాజమాన్యాలు కాలుష్యవ్యర్థాలను రోడ్లపైకే వదులుతున్న పరిస్థితి. ఇక చినుకు పడితే చిత్తడే. 'ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం..సమస్త రోడ్లన్నీ బురదమయం' అన్నట్టు అక్కడ పరిస్థితి ఉంది. వేలాది మంది వలస కార్మికులతో 'మినీ ఇండియా'గా ప్రసిద్ధి చెందిన ఐడీఏ బొల్లారంలో కనీస సౌకర్యాల లేమి, పరిశ్రమల యాజమాన్యాల ఇష్టారాజ్యం, కార్మిక శాఖ నిస్సత్తువపై నవతెలంగాణ కథనం.
ఐడీఏ బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలోని (బొల్లారం, గడ్డపోతారం, బొంతపల్లి) మూడు పారిశ్రామికవాడల్లో దాదాపు 350 భారీ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలున్నాయి. ప్రస్తుతం వాటిలో 280 మాత్రమే పనిలో ఉన్నాయి. ప్రధానంగా రసాయన, ఫార్మా, రబ్బర్, ఐరన్, గ్రానైట్ పరిశ్రమలున్నాయి. ఆ పరిశ్రమల్లో 65 వేల మంది కార్మికులు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, డైలీవేజ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరిలో 90 శాతానికిపైగా వలసకార్మికులే. ఎక్కువగా బీహార్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తదితర రాష్ట్రాలకు చెందిన వారున్నారు. అందుకే ఐడీఏ బొల్లారం మినీ ఇండియాగా ప్రాచుర్యం పొందింది. వీరు కాక మరో ఏడువేల మంది రెగ్యులర్ కార్మికులున్నారు. వీరిలో మాత్రం ఎక్కువ స్థానికులే ఉన్నారు. ప్రధానంగా రసాయన, ఫార్మా, ఐరన్, గ్రానైట్, రబ్బరు కంపెనీలున్నాయి. అరబిందో, రెడ్డిల్యాబ్, హెటిరో, లి-ఫార్మా, గ్రీన్వెల్స్, న్యూలాండ్ పరిశ్రమలు ప్రసిద్ధి పొందినవి. వీటిలోనే సగానిపైగా కార్మికులు పనిచేస్తున్నారు.
యూనియన్లు ఉన్నచోట్ల కొంత బెటరే..
చెరువు గట్టు మీద కొంగ దొంగ జపం చేస్తూ చేపలకు ఎరవేసినట్టు..సందు దొరికితే చాలు వలస కార్మికుల శ్రమను ఏవిధంగా దోచుకోవాలి? అధిక లాభాలు ఏవిధంగా గడించాలి? అనే చందంగా పరిశ్రమల యాజమాన్యాల తీరుంది. చాలా పరిశ్రమల్లో నిమిషం లేట్ అయినా సరే కార్మికులను పనిచేసేందుకు అనుమతివ్వడం లేదు. కొన్నిచోట్లయితే ముందొచ్చిన వారినే అవసరం మేరకు లోనికి పంపి మిగతా వారిని వెనక్కి పంపుతున్న దుస్థితి. దీంతో వారు ఆ రోజంతా వేతనం కోల్పోతున్నారు. ఈ విషయంలో మహిళా కార్మికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఉదయం లేచి ఇంట్లో పని, వంట పనులు పూర్తిచేసుకుని, పిల్లల బాగోలు చూసుకుని హడావిడిగా తిండి తినకుండానే పరిశ్రమలకు పరుగులు పెడుతున్నారు. ఇంత కష్టపడ్డా వారికి దక్కుతున్న వేతనం అంతంతే. 'నిమిషం లేటయినా పనికి రానివ్వరు. ఎవ్వరు ముందు వస్తే వారికే పని. రోజుకు రూ.315 ఇస్తారు. ఆదివారాలు, పండుగ సెలవుల వేతనాలను కట్ చేస్తున్నారు. అన్నీపోనూ నెలకు ఏడువేల రూపాయలు కూడా చేతికి రావు' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ కార్మికురాలు చెప్పింది. ఫొటో కూడా వద్దంటూ ఆమె భర్త నిరాకరించాడు. ఇది మచ్చుకు ఒక ఉదహరణే. బొల్లారం ఏరియాలోని కంపెనీల్లో పనిచేసే కాంట్రాక్టు, డైలీవేజ్ కార్మికులందరికీ ఇదే పరిస్థితి. ఈ నియయాన్ని ఇంత కచ్చితంగా అమలు చేస్తున్న పరిశ్రమలు 8 గంటల పనివిధానాన్ని మాత్రం అమలు చేయడం లేదు. చాలా కంపెనీలు వలస కార్మికులతో 12 నుంచి 14 గంటల పాటు గొడ్డుచాకిరీ చేయిస్తున్నాయి. వేతనాలు మాత్రం 10 నుంచి 15 వేల లోపే ఇస్తున్నారు. పరిశ్రమలో కార్మిక సంఘాలున్న చోట మాత్రం వేతనాలు మంచిగానే ఉన్నాయి. అయితే, గుర్తింపు కార్మిక సంఘాలున్న పరిశ్రమలు మొత్తంగా లెక్కపెడితే పట్టుమని పది కూడా లేవు. ఓ పేరు మోసిన పరుపుల కంపెనీ, మరో మెటల్ పరిశ్రమలో రెండుమూడు నెలలకోసారి వేతనాలిస్తున్న దుస్థితి. కనీసవేతనాలు, పరిశ్రమల్లో కనీస సౌకర్యాల కల్పన విషయంలో తనిఖీలు నిర్వహించాల్సిన కార్మిక శాఖ, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అధికారులు మొద్దునిద్రపోతున్నారు. మహిళాకార్మికులు ఎక్కువున్న చోట వారిపై వేధింపుల నియంత్రణ కోసం కమిటీలు వేయాలి. పిల్లల బాగోలు కోసం క్రెచ్‌లు, కేర్టేకర్లను నియమించాలి. కనీస సదుపాయాలు కల్పించాలి. వీటిపై కార్మికులతో మాట్లాడే సమయంలో పరిశ్రమల్లో అవేవీ లేవని తేటతెల్లమవుతున్నది.
బురద మడులు కాదు రోడ్లే.. కొత్తవి వేసేదెన్నడో
పారిశ్రామిక వాడల్లో సాధారణంగా తారు, సిమెంట్‌తో వేసిన రెండు, నాలుగు లైన్ల రోడ్లు కనిపిస్తాయి. భారీ వాహనాలు వెళ్లేందుకు అనువుగా ఉంటాయి. బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. నిత్యం భారీ వాహనాలు తిరుగుతుండటం, రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, పరిశ్రమలు రోడ్లపైకే వ్యర్థాలను వదులుతుండటంతో అవి బురద మడులను తలపిస్తున్నాయి. అడుగడుగునా రోడ్లపై పెద్దపెద్ద గుంతలు పడి నీటితో నిండిఉన్నాయి.
చాలా వరకు మట్టి రోడ్లే ఉన్నాయి. 20 ఫీట్ల రోడ్లుంటే అవన్నీ చిత్తడిచిత్తడిగా మారాయి. వాటిపై వెళ్లడమంటే పెద్ద సాహసం చేయడమే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, పొరపాటున ఒకే బైకుపై ఇద్దరు వెళ్లాలని చూసినా ఒళ్లంతా బురదమయం కావాల్సిందే. పారిశ్రామిక వాడలోనే కాదు బొల్లారం మున్సిపాల్టీలోనూ రోడ్లది ఇదే పరిస్థితి. ఇదే అదునుగా కొన్ని పరిశ్రమలు కాలుష్య వ్యర్థాలను రోడ్లపైకే వదులుతున్నాయి. మరికొన్ని పరిశ్రమలు డబ్బులు మిగిలించుకోవాలనే దురాశతో వ్యర్థాలను శుద్ధిచేసే ప్రక్రియకు తరలించకుండా చుట్టుపక్కల ఉన్న కుంటలు, చెరువుల్లోకి వదులుతున్నాయి. దీంతో అవి కలుషితమవ్వటంతో పాటు భూగర్భజలాలూ విషతుల్యం అవుతున్నాయి.
కార్మికులకు న్యాయం చేయాలి.. సమస్యలు పరిష్కరించాలి
నర్సింహారెడ్డి, సీఐటీయూ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు
కాంట్రాక్టు కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. 5 నుంచి పదేండ్లు పనిచేసినా పర్మినెంట్ లేదు. జీతాలు పెంచడం లేదు. యాజమాన్యం పిలిచినప్పుడు రావాల్సిన దుస్థితి. 12 గంటల పనివిధానం అమలు చేయడం దారుణం. పీఎఫ్, ఈఎస్ఐ వర్తింపజేయట్లేదు. వీటిపై కార్మిక శాఖ అధికారులు దృష్టి సారించి కార్మికులకు న్యాయం చేయాలి. ముఖ్యంగా మహిళా కార్మికులకు అతి తక్కువ వేతనాలిస్తున్నారు. అందరికీ కనీసవేతనాలు అమలయ్యేలా చూడాలి. ముఖ్యంగా వాయు, జల కాలుష్యాల వల్ల ఇక్కడ పంటలు పండని పరిస్థితి. పారిశ్రామిక వ్యర్థాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. కార్మికులకు న్యాయం జరిగేలా పోరాటాలకు సన్నద్ధం అవుతున్నాం.