Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం
- కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలి
- ఇది 'సేవ్ భారత్' నినాద దేశభక్తుల ఉద్యమం : ప్రతిపక్ష పార్టీల మహాధర్నాలో సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
మరో మహౌద్యమానికి అంకురార్పణ జరిగింది. దానికి హైదరాబాద్ ఇందిరాపార్క్ వేదికైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రతిపక్షపార్టీల ఐక్య గళ నినాదాలు భవిష్యత్ ఉద్యమ బాటను నిర్దేశించాయి. భారీ వర్షంలోనూ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఏడు ప్రధాన ప్రతిపక్ష రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల నాయకత్వంలో ప్రజలు పిడికిలి బిగించి పోరుబాటకు సై అన్నారు.
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారత స్వాతంత్య్ర సంగ్రామ స్ఫూర్తితో దేశ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మరో మహౌద్యమం అవసరమని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దీనికోసం జాతీయస్థాయిలో 19రాజకీయ పార్టీలు ఐక్య కార్యా చరణతో కలిశాయనీ, అనేక రాష్ట్రాల్లో ఇతర పార్టీలు కూడా కలిసివస్తున్నాయని చెప్పారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రతిపక్షపార్టీల ఆధ్వర్యంలో బుధవారంనాడిక్కడి ఇందిరాపార్కు వద్ద మహాధర్నా జరిగింది. సీసీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్, తెలం గాణ జన సమితి, తెలుగుదేశం, సీపీఐ(ఎమ్ఎల్) లిబరేషన్, సీపీఐ(ఎమ్ఎల్) న్యూ డెమోక్రసీ, ప్రజాసంఘాలు ఈ మహాధర్నాలో పాల్గొన్నాయి. దీనికి సీతారాం ఏచూరి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోని ప్రధాన నాలుగు స్తంభాలను అధికార బీజేపీ ధ్వంసం చేయడం ద్వారా భారత రాజ్యాంగ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నదని విమర్శించారు. ప్రశ్నించిన, వ్యతిరేకించిన ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ దాడులతో బెదిరిస్తున్నదని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ పుట్టినరోజు నాడు దేశంలో 2 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారనీ, ఆ తర్వాత ఎందుకు ఆగిందని ప్రశ్నించారు. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన ఇన్‌కంటాక్స్ చెల్లించలేని ప్రజలందరికీ ప్రతినెలా రూ.7,500 చొప్పున బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయాలనీ, వారందరికీ ఉచిత ఆహార ధాన్యాలు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. దేశ రాజధాని సరిహద్దుల్లో పది నెలలుగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత రైతాంగం మహత్తర పోరాటం చేస్తున్నదనీ, వారితో చర్చలు జరిపేందుకు కూడా మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. లేబర్ కోడ్లపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్న కార్మిక వర్గంతో కూడా మోడీ ప్రభుత్వం మాట్లాడట్లేదన్నారు. కానీ అమెరికా, జపాన్ వంటి దేశాల ప్రధానులతో మాట్లాడేందుకు విదేశాలకు వెళ్తున్నారనీ, ఒప్పందాల పేరుతో అక్కడికెళ్లి భారత దేశ సంపదను ఇంకేమేమి అమ్మేసి వస్తారో అనే భయం ప్రజల్లో ఉందన్నారు. దేశం కోసం దేశభక్తులు చేస్తున్న పోరాటంలో ప్రజలందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయపార్టీల కలయిక దానికోసమేనని వివరించారు.
ఇది ఆరంభం : డాక్టర్ కె నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ మాట్లాడుతూ మోడీ, కేసీఆర్‌ల పాలన అంతానికి ఇది ఆరంభమని అన్నారు. మోడీ వ్యతిరేక ప్రభంజనం ఇక్కడి నుంచే దేశవ్యాప్తమవుతుందని చెప్పారు. పంచభూతాలనూ ఆమ్మేసే చరిత్రహీను డిగా ప్రధాని నరేంద్రమోడీ మిగిలిపోతారన్నారు. విమర్శిస్తే కేసులు పెట్టి బెదిరిస్తు న్నారనీ, అదే వ్యక్తులు బీజేపీలో చేరితే పునీతులు అవుతున్నారని ఎద్దేవా చేశారు. అందమైన అబద్ధాలు చెప్పడంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ దిట్ట అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కోసం అప్పట్లో వెంకయ్య నాయుడు కొట్లాడారనీ, ఇప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తామంటుంటే ఉపరాష్ట్రపతి హౌదాలో మౌనంగా ఎందుకుంటున్నారని ప్రశ్నించారు. రాజకీయంగా పార్టీలన్నీ ఐక్యం అయ్యి, ఉమ్మడి ఉద్యమాల ద్వారా కేంద్రంలో నరేంద్రమోడీ, రాష్ట్రంలో కేసీఆర్ పాలనను అంతం చేయాలని చెప్పారు.
రాష్ట్రస్థాయి ఆందోళనలు జయప్రదం చేయండి
తమ్మినేని వీరభద్రం, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రతిపక్షపార్టీల ఉమ్మడి కార్యాచరణతో రాష్ట్రంలో చేపట్టే ఆందోళనా కార్యక్రమాలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఈనెల 27న జరిగే భారత్‌బంద్‌ను సాధారణ ప్రజల స్థాయికి అన్ని పార్టీలు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్య సంస్థలకు ముందురోజే సమాచారం ఇచ్చి, మద్దతు కోరాలని చెప్పారు. 30వ తేదీ జిల్లా స్థాయిలో ప్రతిపక్షపార్టీల నాయకులు స్థానిక సమస్యలతో కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని కోరారు. పోడుభూముల సమస్యపై బాధిత కుటుంబాలను కలుపుకెళ్తూ, అక్టోబర్ 5వ తేదీ జరిగే 400 కిలోమీటర్ల రహదారుల దిగ్బంధం కార్యక్రమాలను జయప్రదం చేయాలని చెప్పారు. ఆ రోజు ప్రతి కిలోమీటర్కూ ఓ బృందం చొప్పున ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కచ్చితంగా రహదారుల దిగ్బంధనాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. పోడు భూముల వ్యవహారంలో సూది మొన మోపినంత భూమిని కూడా వదిలేది లేదనీ, పట్టాలు ఇచ్చే వరకు పోరాటం అపేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దొంగ మాటల్ని నమ్మే స్థితిలో పోడురైతులు లేరని స్పష్టంచేశారు.
నరహంతక పాలన
చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ నరహంతక పాలన సాగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. వ్యవసాయ చట్టాల పేరుతో రైతుల్ని, ప్రభుత్వ ఆస్తుల వేలం పేరుతో ప్రజల్ని, చట్ట సవరణల పేరుతో కార్మిక హక్కుల్ని కాలరాస్తున్నారని చెప్పారు. మతోన్మాద నియంతృత్వ ఫాసిస్టు పాలనతో కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారని అన్నారు. దేశపౌరులు ఆలోచించాలనీ, ఆ ఐక్యత భవిష్యత్ పోరాటాల్లో కనిపించాలని ఆకాంక్షించారు.
గులాబీ చీడకు మోడీ అండ
పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
బీజేపీ అధికారంలోకి వచ్చాక గుజరాత్ పెట్టుబడిదారులు అంబానీ, అదానీ దేశాన్ని దోచుకుంటున్నారనీ, వారి నుంచి దేశాన్ని విముక్తి చేయాల్సిన అవసరం ఉందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. నాడు ఈస్టిండియా కంపెనీ దేశాన్ని దోచుకునిపోయిందనీ, నేడు మోడీ అండదండలతో అదానీ, అంబానీలు సహజ సంపదను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.గత ఎన్నికల్లో నమో అంటూ ఆకాశానికెత్తారనీ, అది నమ్మించి మోసం చేయడమేనన్నారు. తెలంగాణ రాష్ట్రానికి గులాబీ చీడ పట్టిందనీ, దానికి మోడీ అండదండలిస్తున్నారని విమర్శించారు. అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్‌ను గద్దెదించాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో పోడు సాగుదార్లపై దాడులు పెరిగిపోయామన్నారు. అన్ని పార్టీలు ఏకం కావడంతో ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం నియమించిందనీ, దీంతో కాలయాపన చేసేందుకు జిత్తులమారి నక్కలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అక్టోబర్ 5న అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు రాస్తారోకోలు నిర్వహించి సర్కారు కండ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, కమ్యూనిస్టుల సహకారంతో అటవీ హక్కుల చట్టం వచ్చిందనీ, ఈ చట్టాన్ని కేసీఆర్ తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచి పన్ను రూపంలో లక్షల కోట్లు దోచుకుంటున్నాయని చెప్పారు.
విచ్చలవిడి భూసేకరణను ఆపాలి
టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం
రాష్ట్రంలో విచ్చలవిడి భూసేకరణను ఆపేయాలని టీజేఎస్ అధ్యక్షులు, ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో విడుదల చేయకపోవడంతో తమకు ఉద్యోగం రాదనే ఆందోళనతో 18 మంది నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలు ఒకవైపు... ఉపాధి కరువై మరోవైపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేక సీఎం కేసీఆర్ ఒంటరైపోయారని చెప్పారు. ప్రజల కోసం కాకుండా కొంత మంది ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. పోడు సమస్యపై 5న రాస్తారోకోలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రైతులతో ఆటలొద్దు
రాజేష్, కార్యదర్శి సీపీఐ(ఎంఎల్) లిబరేషన్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆటలాడుతున్నాయని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి కె రాజేష్ విమర్శించారు. రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలు మనుగడ సాగించలేదన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న పాలకులకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీహార్‌లో అరాచక పాలనను ఎండగట్టినట్టే...ఇక్కడ కూడా టీఆర్ఎస్ నియంతృత్వ పాలనపై పోరాడాలని కోరారు. నిధులూ, నియామకాల పేరుతో పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజా సమస్యలు తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికుల హక్కులను కాలరాస్తున్నది
సాదినేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ
బ్రిటీష్ హయాం నుంచి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కోడ్ల రూపంలో తీసుకొచ్చి ప్రధాని మోడీ హక్కులను కాలరాస్తున్నారని సాదినేని వెంకటేశ్వరరావు విమర్శించారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగానే దేశంలో పోరాటాలు ఉధృతమవుతున్నాయని చెప్పారు. అదానీ, అంబానీల ముందు మోడీ సర్కారు మోకరిల్లుతున్నదని విమర్శించారు. నోట్ల రద్దుతో దేశం అతలాకుతలమైందనీ, నల్లధనాన్ని తెచ్చి పేదల ఖాతాల్లోవేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. బ్యాంకుల ప్రయివేటీకరణ పేరుతో పెట్టుబడిదారులు ఇతర దేశాల్లో డబ్బుదాచుకునేందుకు మార్గం సుగమనం చేస్తున్నారని విమర్శించారు.
బంగారు కూర్చీ వేస్తాం..పోడు సమస్యను పరిష్కరించండి
పోటు రంగారావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ
కూర్చీ వేసుకుని పోడు సమస్యను పరిష్కారిస్తానన్న సీఎం కేసీఆర్ మాట తప్పారని పోటు రంగారావు విమర్శించారు. తలా రూపాయి వేసుకుని కేసీఆర్‌కు బంగారు కూర్చీ వేస్తామనీ, పోడు సాగుదార్లకు పట్టాలివ్వాలని కోరారు. రాంజీ, కొమురంభీం స్ఫూర్తితో ఒక ఎకరం కూడా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ధరణి వెబ్సైట్లో 28లక్షల ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారని ప్రశ్నించారు. ధర్మం కోసం, రాష్ట్రం కోసం కలిసి ఆందోళనలు నిర్వహించాలని కోరారు. మోడీ విధానాలకు వ్యతిరేకంగా అన్ని ప్రజలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.
కార్పొరేట్లకు మోడీ ఊడిగం
రావుల చంద్రశేఖరరెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యులు టీటీడీపీ
కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నదని రావు చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని కోరారు. కరోనాలో రైళ్లు, విమానాలు,పోర్టులు ఆగిపోయాయనీ, కానీ వ్యవసాయం ఆగలేదన్నారు. రైతుల కష్టపడి దేశానికి అన్నం పెడుతున్నారనీ, ఆ రైతులను కూలీలుగా మార్చేందుకు మోడీ సాగు చట్టాలు తెచ్చారని విమర్శించారు. సాగును సైతం ప్రయివేటీకరించేందుకు మోడీ పరుగులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీరశివాజీ ఎక్కడ..మోడీ ఎక్కడ
చెరుకు సుధాకర్, అధ్యక్షులు ఇంటిపార్టీ
వీరశివాజీ వారసులమని చెబుతున్న మోడీ..ఆయన స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఇంటిపార్టీ రాష్ట్ర అధ్యక్షులు చెరుకు సుధాకర్ విమర్శించారు. ఆయనకు,మీకు పోలికేంటని ప్రశ్నించారు. తన రాజ్యం కోసం వీరశివాజీ తన ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదనీ, మోడీ మాత్రం దేశాన్ని అమ్ముతున్నారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ధర్నాచౌక్‌పై నిషేధం పెడితే..దానిని సాధించుకునేందుకు కమ్యూనిస్టులు రక్తమోడారని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితో భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో మధుయాష్కీ, మల్లురవి, నాగం జనార్థన్‌రెడ్డి, కోదండరెడ్డి, పొన్నం ప్రభాకర్, సునీతారావు (కాంగ్రెస్), డిజి నరసింహారావు, చెరుపల్లి సీతారాములు(సీపీఐ(ఎం), అజీజ్‌పాషా, సాంబశివరావు, బాలమల్లేష్ (సీపీఐ), వేములపల్లి వెంకట్రామయ్య, కె రమ, రాయలచంద్రశేఖర్, కె గోవర్ధన్, సంధ్య, గుమ్మడి నరసయ్య (సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ), పిఎల్ విశ్వేశ్వరరావు (టీజేఎస్), కందారం నారాయణ, దార సత్యం ( ఫార్మాసిటీ నిర్వాసితులు) తదితరులు పాల్గొన్నారు.