Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా స్కీం వర్కర్లు గురువారం దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, టీఆర్ఎస్కేవీ, టీఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, ఏఐయూటీయూసీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సమ్మె జరగనుంది. దేశంలో కోటి మంది, రాష్ట్రంలో 2.50 లక్షల మంది వర్కర్లు పలు స్కీంలలో పనిచేస్తున్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలనీ, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సర్వీసులను క్రమబద్ధీకరించేంత వరకు కనీస వేతనం రూ.21 వేలు చెల్లించాలని కోరుతున్నాయి. వారి సర్వీసుల క్రమబద్ధీకరణ కోసం 45,46వ అంతర్జాతీయ లేబర్ కాన్ఫరెన్స్ ప్రతిపాదనలు అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని సూచిస్తున్నాయి. కరోనా కాలంలో పనిచేసిన వారికి నెలకు రూ.7,500 బకాయిలతో సహా చెల్లించాలనీ, కోవిడ్ సోకిన వారికి రూ.10 లక్షలు, చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్రం ప్రకటించిన రూ.50 లక్షలు ఇవ్వాలని కోరుతున్నాయి. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు బకాయిలివ్వాలనీ, వేసవిలోనూ జీతాలు చెల్లించే విధానం ప్రవేశపెట్టాలని సూచిస్తున్నాయి. పదవీ విరమణ చేసిన స్కీం వర్కర్లకు నెలకు రూ.10 వేలు పింఛన్ ఇవ్వాలనీ, మధ్యాహ్న భోజన పథకంలో ఇస్కాన్, అక్షయపాత్ర వంటి సంస్థలను నిషేధించాలనీ, ఐసీడీఎస్, ఎండీఎంఎస్ను ప్రయివేటీకరించొద్దని తెలిపాయి. ఆహారం, విద్యా హక్కు మాదిరిగా సార్వత్రిక ఆరోగ్య భద్రత హక్కు చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నాయి. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను ఉపసంహరించాలనీ, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ ప్రక్రియను నిలిపేయాలని కోరుతున్నాయి. మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయిలో అప్‌గ్రేడ్ చేయాలని పేర్కొన్నాయి. రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈనెల 27న భారత్‌బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.