Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మణుగూరు ఏరియా పగిడేరు పైలట్ ప్రాజెక్టు
- ఆరునెలల్లో పూర్తి: సింగరేణి సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశంలో తొలిసారిగా వేడినీళ్లతో విద్యుదుత్పత్తిని చేపట్టే జియో థర్మల్ కేంద్రాన్ని సింగరేణి కాలరీస్ సంస్థ నిర్మించనుంది. దీనికోసం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ద్వారా రూ.1.72 కోట్ల నిధులను కేటాయించినట్టు సింగరేణి సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ తెలిపారు. దీనిపై గురవారంనాడాయన సింగరేణి అధికారులు, నిర్మాణ సంస్థ శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండిస్టియల్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరునెలల్లో నిర్మాణం పూర్తి చేసి జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలనిదిశా నిర్దేశం చేశారు. 3 వేల చదరపు అడుగుల్లో నిర్మాణం చేపట్టి, 20 కిలో వాట్ల విద్యుత్ ఉత్పాదన ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా జరుగుతుందని వివరించారు. మణుగూరు ఏరియా పరిధిలోని పగిడేరు, ఖమ్మంతోగు, బుగ్గ తదితర గ్రామాల్లో వేడి నీటి మడుగులు ఉన్న విషయం దశాబ్ద కాలంగా స్థానికులకు తెలుసనీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పగిడేరు ప్రాంతంలో 10 ఏండ్ల క్రితం డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు గ్రామానికి సమీపంలోని పొలాల్లో వేడి నీరు పెద్ద ఎత్తున ఉబికి వస్తున్న విషయాన్ని గమనించారని తెలిపారు. సుమారు వెయ్యి మీటర్ల లోతు నుంచి ఈ నీరు వస్తుందని గుర్తించారనీ, ఈ ప్రాంతంలో సింగరేణి సంస్థ అధికారులు కూడా బొగ్గు అన్వేషణలో భాగంగా బోర్ హౌల్స్ వేస్తున్నప్పుడు ఇదే విషయాన్ని గమనించారని వివరించారు. ఇక్కడ 50-90 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉబికి వస్తున్న వేడి నీటిని వినియోగించి విద్యుత్‌ను తయారు చేయవచ్చని గుర్తించిన సింగరేణి యాజమాన్యం ఈ దిశగా శాస్త్రీయ అధ్యయనం చేసి ప్లాంట్ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను ఒక నివేదిక ద్వారా కోరిందని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన బొగ్గు శాఖ వారు పగిడేరు ప్రాంతంలో భూగర్భం నుంచి ఉబికి వచ్చే వేడి నీటితో 20 కిలో వాట్ల విద్యుత్ ను ప్రయోగాత్మకంగా ఉత్పత్తి చేయడానికి రూ.1.72 కోట్ల ను కేటాయించి సింగరేణి ఆధ్వర్యంలో ఢిల్లీకి చెందిన ప్రముఖ పరిశోధన సంస్థ శ్రీరామ్ ఇన్‌స్ట్టిట్యూట్ ఆఫ్ ఇండిస్టియల్ రీసెర్చ్ సంస్థకు పనులు అప్పగించిందన్నారు. పగిడేరు సమీపంలో 3 వేల చదరపు అడుగుల ప్రయివేటు స్థల సేకరణ, గ్రామం నుంచి అప్రోచ్ రోడ్ నిర్మాణం, నీరు ఉబికి వస్తున్న బోర్ హౌల్ వద్ద యంత్ర విభాగాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన షెడ్డు నిర్మాణం, ఆ ప్రదేశానికి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు, ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ట్రాన్స్‌కోకు అనుసంధానం చేయడానికి కావాల్సిన లైన్ల నిర్మాణంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు వివరించారు.