Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎస్ఆర్ఐ ఇంటర్నేషనల్ (గతంలో స్టాన్ ఫోర్డ్ రీసెర్చ్ ఇనిస్టి ట్యూట్) మూలాలు కలిగిన ఇన్సూర్ టెక్ వెంచర్ వింగ్ స్యూర్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రైతులను కాపాడేందుకు కృత్రిమ మేధను, లోతైన సాంకేతికతను వినియోగిస్తున్నది. ఈ ఒప్పందంలో భాగంగా వింగ్ స్యూర్ పంట బీమా ఉత్పాదనలను, సలహా సేవలను చిన్న రైతులకు అందించనున్నది. ఈ తరహా ఒప్పందాల్లో ఇదే మొదటిది. రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ (ఐటిఇ అండ్ సి) ఒప్పంద అమలు బాధ్యతలను కూడా చేపడుతుంది. వ్యవసాయ విభాగం దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయనుంది. ఈ కార్యక్రమం కింద రైతులకు అవసరమైన శిక్షణ, సలహా సేవలను ఆ సంస్థ రైతులకు అందిస్తుంది. అదే విధంగా సమాచార సేకరణ, ఇతర కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది. దానికి తోడుగా, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రకల్చరల్ యూనివర్సిటీ పరిశోధన కేంద్రాలు ఆయా పంటలకు, శీతోష్ణస్థితి పరిస్థితులకు సంబంధించి సలహాలు, సూచనలను వింగ్ స్యూర్ వేదిక ద్వారా అందించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ, వ్యవసాయ ఉత్పాదనను పెంచడంలో, రైతుల జీవ నోపాధులను మెరుగుపరచడంలో కృత్రిమ మేధ, ఇతర వర్ధమాన సాంకేతికతల ప్రాధాన్యాన్ని గుర్తించి ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. వింగ్ స్యూర్ వ్యవస్థాపకులు, సీఈఓ అవి బసు మాట్లాడుతూ, 20 మిలియన్ల మంది రైతుల జీవితాలను మెరుగుపరిచేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.