Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మావోయిస్టులకు యువకులు ఆకర్షితులు కావొద్దు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్
నవతెలంగాణ-కొత్తగూడెం
నిషేధిత సీపీఐ(మావోయిస్ట్) కి చెందిన పలువురు యువ మిలీషియా సభ్యులు పోలీసులకు లొంగిపోయినట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ తెలిపారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రంపాడు, రాళ్ళపురం, రామచంద్రాపురం, కిష్టారంపాడు, కొరకట్పాడు గ్రామాలకు చెందిన 14 మంది మిలీషియా సభ్యులు చర్ల పోలీస్‌స్టేషన్‌లో సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ అధికారుల ఎదుట బుధవారం లొంగిపోయారని తెలిపారు. లొంగిపోయిన వారిలో ఎర్రంపాడు గ్రామానికి చెందిన కొవ్వాసి అయిత అలియాస్ పాపారావు, కొవ్వాసి దేవ, కొవ్వాసి ఉంగాల్, మడకం కోస.. రాళ్ళపురం గ్రామానికి చెందిన మూచిక భీమ అలియాస్ గౌతమ్, పోడియం సోమిడి, రామచంద్రపురం గ్రామానికి చెందిన మడకం ఉంగయ్య, అలియాస్ పొట్టి ఉంగయ్య, ముసకి సత్యనారాయణ, కట్టం శ్రీను, పెట్టి విజరు కుమార్, కిష్టారంపాడు గ్రామానికి చెందిన లక్ష్మయ్య అలియాస్ లక్మా, మడకం మోటు, వంజమ్ కొస, రవ్వ సిద్దు ఉన్నారు. వీరిలో ఒక యువతి ఉంది.
కొన్నేండ్లుగా ఈ 14 మంది సభ్యులు సీపీఐ(మావోయిస్ట్) మిలీషియా సభ్యులుగా పని చేస్తున్నారు. వీరికి ఇష్టం లేకపోయినా మావోయిస్టు పార్టీ నాయకులు బలవంతంగా పార్టీలో చేర్చుకున్నారు. ఇటీవల పెసర్లపాడు, పుట్టపాడు, చందా ప్రాంతాలకు వీరిని బలవంతంగా శిక్షణకు తీసుకొని వెళ్లారు. వీరందరూ మావోయిస్ట్ పార్టీ చర్ల ఏరియా కమిటీ కోసం పని చేశారని తెలిపారు. యువత విప్లవ సాహిత్యానికి ఆకర్షితులు కావొద్దని ఎస్పీ సూచించారు.