Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006ను అమలు చేయాలి
- మంత్రి సత్యవతి రాథోడ్‌కు టీజీఎస్ వినతిపత్రం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) శాసనసభాపక్ష మాజీ నాయకులు జూలకంటి రంగారెడ్డితో పాటు తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు పోడు భూముల సమస్యలపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం చైర్మెన్ సత్యవతి రాథోడ్‌ను గురువారం హైదరబాద్‌లో ఆమె కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ పోడు భూముల సమస్య పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం సమస్య మూలాల్లోకి వెళ్లాల్సి ఉంటుందని గుర్తుచేశారు. అటవీ శాఖ లెక్కలు, వివరాలపై ఆధారపడితే సమస్య మళ్లీ మొదటికొస్తుందని చెప్పారు. పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో ఏడేండ్లుగా ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసిందని తెలిపారు. దీంతో సమస్య మరింత తీవ్రమైందని వివరించారు.వాటిని సాగు చేస్తున్న గిరిజన రైతులపై అటవీ శాఖ, పోలీసులు కలిసి దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. వేసిన పంటలను ధ్వంసం చేస్తున్నారనీ, కందకాలు తీస్తున్నారని చెప్పారు. అడ్డుకున్న గిరిజనులు, పేదలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని విమర్శించారు. హత్యానేరం కింద కేసులు నమోదు చేస్తున్నారనీ, పసిపిల్లలు, మహిళలను సైతం ఈ కేసుల్లో ఇరికించడం అన్యాయమన్నారు. విత్తనాల సీజన్ వచ్చిందంటే..గ్రామాలు, గిరిజన గూడేలు, తండాలులో యుద్ధవాతావరణం నెలకుంటున్నదని చెప్పారు. ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి గతంలో ఈ విషయమై చేసిన వాగ్దానాలు మరిచారని విమర్శించారు.
తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరాం నాయక్ మాట్లాడుతూ గిరిజనుల పోడు భూముల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఏడేండ్ల పాలనలో ఒక్క ఎకరం భూమి కూడా గిరిజనులకు పంచలేదని చెప్పారు. పైగా వారిపై తీవ్ర నిర్భంధాన్ని అమలు చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వం పట్ల గిరిజనుల్లో పెరుగుతున్న వ్యతిరేకతను గమనించిన సర్కారు కంటి తుడుపు చర్యగా ఉపసంఘం వేసిందన్న అనుమానాలు గిరజనుల్లో వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. ధర్మానాయక్ పాల్గొన్నారు.