Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌పై ఈనెల 27న రైతుసంఘాలు తలపెట్టిన భారత్‌బంద్‌కు యువజన సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో యువతీయువకులు స్వచ్చంధంగా పాల్గొనాలని పిలుపునిచ్చాయి. గురువారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అనిల్‌కుమార్, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి కెఎస్ ప్రదీప్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామ రామ్మోహన్‌రెడ్డి, ఇంటిపార్టీ యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ సందీప్ చమర్, టీజేఎస్ యువజన విభాగం ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎర్ర వీరన్న మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ శక్తుల మెప్పుకోసం పనిచేస్తున్నదని విమర్శించారు. అంబానీ, అదానీకి దేశ సంపదతోపాటు వ్యవసాయరంగాన్ని అప్పగించేందుకు కుట్ర జరుగుతున్నదని చెప్పారు. రైతులకు నష్టం చేసే వ్యవసాయ చట్టాలతోపాటు విద్యుత్ సవరణ బిల్లును తెచ్చిందన్నారు. కంపెనీ వ్యవసాయం ప్రారంభించాలనీ, రైతులను వారి భూముల్లోనే కూలీలుగా మార్చబోతున్నదని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరిస్తూ నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని వివరించారు. సమ్మె హక్కు, కనీస సౌకర్యాలు కల్పించే హక్కును రద్దు చేసి కార్పొరేట్లకు ఊతమిచ్చేలా చట్టాలను సవరించిందని అన్నారు. పది నెలలుగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతున్నా, 600 మంది వరకు రైతులు చనిపోయినా మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. దేశానికి అన్నం పెట్టే రైతున్నలకు యువకులంతా అండగా నిలబడాలని కోరారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకూ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశంలో రోజురోజుకూ నిరుద్యోగ సమస్య పెరుగుతున్నదని చెప్పారు. మోడీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం లేదని విమర్శించారు. భారత్‌బంద్‌కు వ్యాపార, వాణిజ్య సముదాయాలతోపాటు ప్రజలు సంఘీభావం ప్రకటించాలనీ, జయప్రదం చేయాలని కోరారు.