Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ
నల్లగొండ జిల్లా ముషంపల్లి గ్రామంలో మహిళపై లైంగికదాడి.. హత్య ఘటన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్లగొండ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం మీడియాకు వివరించా రు.ముషంపల్లి గ్రామానికి చెందిన బక్కతుట్ల లింగయ్య, యెర్పు జిల్లా శంకర్ అలియాస్ పుల్లయ్య పూటుగా మద్యం తాగారు. అదే సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను బలవంతంగా లింగయ్య ఇంట్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి యత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో తలను నేలకేసి కొట్టి నోరు, ముక్కు మూసి లైంగికదాడి చేశారు. అనంతరం ఆమెను హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకున్నారు. ఇది గమనించిన గ్రామస్తులు ఇద్దరు నిందితులను పట్టుకుని నల్లగొండ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో కీలక ఆధారాలు సేకరించింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమావేశంలో టు టౌన్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, రూరల్ ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: సునీతా లక్ష్మారెడ్డి
ముషంపల్లి ఘటన బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. గురువారం సాయంత్రం ముషంపల్లి బాధితురాలి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. దుండగులు శిక్ష నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని అన్నారు. ఇప్పటికే పోలీసులు బలమైన సాక్ష్యాధారాలు సేకరించారన్నారు. గ్రామంలో బెల్ట్ షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు భరోసా ఇచ్చారు. అంతకు ముందు ఆమె ఇదే విషయంపై నల్లగొండలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, డీఐజీ ఏవి.రంగనాథ్, జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్‌తో సమావేశమై ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ముషంపల్లి ఘటన అమానుషం : మంత్రి జగదీశ్‌రెడ్డి
ముషంపల్లి ఘటన అమానుషమని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో బాధితురాలి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముషంపల్లి ఘటనపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరుగుతుందన్నారు. దుండగులకు కఠిన శిక్ష పడేలా ఆధారాలు సేకరిస్తున్నారని తెలిపారు. ఆయన వెంట నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్, డీఐజీ ఏవి.రంగనాథ్, నల్లగొండ మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి తదితరులు ఉన్నారు.
ఐద్వా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. మహిళ హత్యకు నిరసనగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్పీ రంగనాథ్‌కు వినతిపత్రం అందజేశారు.