Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య
- కేంద్ర తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి
- కార్మిక ఐక్య పోరాటాలతో ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలి
- సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించిన కార్మిక గర్జన పాదయాత్ర
నవతెలంగాణ-గుమ్మడిదల
కార్మికుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయనీ, కార్మికవర్గ ఐక్యతతో ఈ ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య పిలుపునిచ్చారు. కనీసవేతనాల జీవోలను సవరించాలనీ, కేంద్ర తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన కార్మిక గర్జన పాదయాత్ర గురువారం గాగిల్లపుర్ మీదుగా సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామిక ప్రాంతంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా కార్మిక గర్జన పాదయాత్ర బృందానికి సీఐటీయూ శ్రేణులు, కార్మికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు ప్రధాన వీధుల గుండా తిరుగుతూ పలు పరిశ్రమల వద్ద కార్మికులనుద్దేశించి పాదయాత్ర బృందం సభ్యులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య, జి.జయలక్ష్మి మాట్లాడారు. పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికుల శ్రమను యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు కనీస వేతనం రూ. 18 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కార్మికుల పక్షాన పోరాటం చేయడానికి సీఐటీయూకే సాధ్యమన్నారు. బంద సభ్యులు, రాష్ట్ర కార్యదర్శి భూపాల్ మాట్లాడుతూ.. పరిశ్రమ యజమాన్యాలు కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదన్నారు. బొల్లారం పారిశ్రామిక ప్రాంతాల్లో తిరిగిన పాదయాత్రలో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయనీ, ముఖ్యంగా కార్మికులకు యజమాన్యాలు ఏడెనిమిది వేలలోపే వేతనాలివ్వడంతో వారు దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వలస కార్మికుల సమస్యలు తెలుసుకునే నాథుడే కరువయ్యారన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, బందం సభ్యులు పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 73 షెడ్యూల్డ్ పరిశ్రమలకు సంబంధించిన కనీస వేతనాల జీవోలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర బృందం గురువారం రాత్రి బొల్లారంలో బస చేయనుంది. ఈ యాత్రలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ఉపాధ్యక్షులు మల్లిఖార్జున్, నాయకులు బీరం మల్లేశం, రాజయ్య, మాణిక్యం, సాయిలు నర్సింహారెడ్డి, మహిపాల్, యాదగిరి, ప్రవీణ్, బాగరెడ్డి, ప్రసన్న, రాజు నాగేశ్వరరావు తదతరులు పాల్గొన్నారు.