Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షోభంలోకి నెడుతున్నారు.
- కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు
- విజయవంతమైన కార్మిక పోరు యాత్ర ముగింపు సభ
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కాలరీస్ కంపెనీకి ప్రమాదం పొంచి ఉందనీ, సంస్థ సంక్షోభంలోకి వెళ్లే అవకాశం కనిపిస్తుందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సీఐటీయూ కార్మిక పోరు యాత్ర గురువారం రాత్రి కొత్తగూడెంలో ముగిసింది. ముగింపు సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీస్ ఎదుట ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సాయిబాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థను బంగారు బాతులా వాడుకుంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన రూ.12 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సింగరేణి సంస్థకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు సింగరేణిలో అమలు జరుగుతున్నాయన్నారు. బీఎస్ఎన్ఎల్, ఆర్టీసీ లాంటి సంస్థలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాల వల్ల నష్టాల్లోకి నెట్టివేయబడ్డాయని వివరించారు. సింగరేణి సంస్థ సాధించిన లాభాల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ.వేల కోట్లు అభివృద్ధి పనులకు కేటాయిస్తున్న యాజమాన్యానికి సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కనిపించడంలేదా అని ప్రశ్నించారు.
యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి బంట్రోతుల్లాగా పనిచేస్తున్నారని విమర్శించారు. సింగరేణి కార్మికులకు 250 గజాల స్థలం పట్టా చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లక్షా యాభై వేల మంది కార్మికులు ఉన్న సింగరేణి సంస్థలో సంస్కరణల మూలంగా 43 వేల మందికి కుదించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇదే తరుణంలో కాంట్రాక్ట్ కార్మికులు పెరిగారని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయకుండా వారితో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేయడంలో వేగంగా ముందుకు సాగుతుందన్నారు. ఈ ప్రభావంతో భవిష్యత్తులో సింగరేణి సంస్థ ప్రయివేటుపరం చేస్తే ఇప్పుడున్న అధికారులకు ఈ ఉద్యోగాలు కూడా ఉండవనీ, వీఆర్ఎస్ పెట్టుకొని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఇలాంటి పలు కార్మిక సమస్యలపై అక్టోబర్ 8న జరిగే సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 13వ తేదీన ప్రారంభమైన కార్మిక పోరు యాత్ర జాతను కోల్ బెల్టు వ్యాప్తంగా సింగరేణి కార్మిక ప్రాంతాలలో బ్రహ్మరథం పట్టిన కార్మికులకు పోరు యాత్ర బృందం కృతజ్ఞతలు తెలిపింది. ముగింపు సభలో.. సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు, అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు యర్రగాని కృష్ణయ్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్, అధ్యక్షులు ఎంవీ అప్పారావు పాల్గొన్నారు.