Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూ సేకరణ చట్టప్రకారం నష్టపరిహారం చెల్లించాలి
- మార్కెట్ రేటు కన్నా నాలుగింతలెక్కువే ఇవ్వాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- భూ నిర్వాసితులకు సంఘీభావం
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బండరావిరాలలో దశాబ్దాలుగా పోరాడుతున్న మైనింగ్ జోన్ బాధితులకు న్యాయం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. భూసేకరణ చట్టప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, మార్కెట్ రేటుకు నాలుగింతలు ఎక్కువే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. బండరావిరాల గ్రామ రెవెన్యూ సర్వే నెం.268లో సుమారు 570 ఎకరాల భూమి కోల్పోయిన 209 మంది రైతులు తొమ్మిది రోజులుగా చేస్తున్న ధర్నాకు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములుతో కలిసి తమ్మినేని గురువారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. నాలుగు దఫాలుగా పట్టాలు పొందిన భూమిని 17 ఏండ్ల కిందట ప్రభుత్వం మైనింగ్ జోన్ కింద లాక్కుందన్నారు. నాటి నుంచి నేటి వరకు పరిహారం కోసం, న్యాయం కోసం రైతులు పోరాడుతూనే ఉన్నారని, అయినా సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులను, కలెక్టర్లను, ఆర్డీవోలను, తహసీల్దార్లకు భూ నిర్వాసితులు పలు దఫాలుగా తమ సమస్యను విన్నవించుకున్నా పరిష్కారానికి నోచుకోలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఈ సమస్యపై దృష్టి పెడితే బాగుండేదన్నారు. రైతులు మైనింగ్ జోన్ కింద భూములు కోల్పోవడమేగాక, ఇక్కడి పరిసర ప్రాంతాలు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయని తెలిపారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని తాను గతంలో పాదయాత్ర చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, లేకపోతే రైతులతో కలిసి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కవాడి శ్రీనివాస్‌రెడ్డి, సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పగడాల యాదయ్య, నాయకులు ఏర్పుల నరసింహ, డి.కిషన్, అరుణ్‌కుమార్, నిర్వాసితుల కమిటీ నాయకులు, సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.