Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దొడ్డు బియ్యం కొనబోమని కేంద్రం మెలిక
- మేమూ కొనబోమంటూ చేతులెత్తేస్తున్న రాష్ట్ర సర్కార్
- గోదాంలో మగ్గుతున్న బియ్యాన్ని పేదలకు పంచాలి
- కార్మిక గర్జన పాదయాత్ర ముగింపులో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కార్పొరేట్లకు తోత్తుగా మారిన మోడీ సర్కార్ కార్మికులను, రైతాంగాన్ని నిండా ముంచుతోందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సీఐటీయూ రాష్ట్ర నాయకత్వం చేపట్టిన కార్మిక గర్జన పాదయాత్రకు అనుసంధానంగా కరీంనగర్ జిల్లా కమిటీ చేపట్టిన యాత్ర గురువారం ముగిసింది. మూడోరోజు జిల్లా కేంద్రం నుంచి మానకొండూరు రైస్ మిల్ ఇండిస్టీ వరకు యాత్ర సాగింది. అక్కడ ముగింపు సభలో జూలకంటి మాట్లాడారు. రాష్ట్రంలో 73షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పదిహేనేండ్లుగా జీతాలు పెరగలేదని తెలిపారు. 2007, 2009సంవత్సరాల మధ్య కొంత వేతన సవరణ జరిగినా.. పూర్తిస్థాయిలో అందలేదన్నారు. ఐదేండ్లకోసారి వేతన సవరణ జీవోలు విడుదల చేయాల్సిన సర్కారు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. సీఐటీయూ పెద్దఎత్తున ఆందోళన చేయగా 5 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో వేతన సవరణ చేసి.. రూ.18వేల కనీస జీతం ఇవ్వాలని ముసాయిదా తయారు చేశారన్నారు. వెంటనే యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని కూడా నిలిపి వేయించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు దొంగచాటుగా 29కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిందన్నారు. మరోవైపు వచ్చే యాసంగిలో దొడ్డు బియ్యం తీసుకోబోమని కేంద్రం మెలిక పెట్టిందని, ఆ సాకుతో రాష్ట్ర సర్కారు కూడా చేతులెత్తేస్తానని చెబుతోందని చెప్పారు. అదే జరిగితే నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో పెద్దఎత్తున రైస్ మిల్లులు మూతపడే ప్రమాదం ఉందన్నారు. అందులో పనిచేసే కార్మికులు ఉపాధి కోల్పోతారని తెలిపారు. ఇలాంటి కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వాల మెడలు వంచేందుకు ఈనెల 27న జరగబోయే భారత్ బంద్‌లో పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక, కర్షకులకు పిలుపునిచ్చారు.
ఐక్య పోరాటాలతోనే కార్మికుల హక్కులు రక్షించుకోగలుగుతామని సీఐటీయూ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు గీట్ల ముకుందరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లాలో గతంలో రైస్ మిల్ ఆపరేటర్ల జీతాలు పెంచాలని నెల రోజులు సమ్మె చేసిన విషయాన్ని గుర్తు చేశారు. చివరకు అధికారులు స్పందించి దిగొచ్చారని తెలిపారు. ఆ సమ్మె స్ఫూర్తితో ఇప్పుడు కూడా పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు.ఈ సభలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుడికందుల సత్యం, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బీమా సాహెబ్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు రజనీకాంత్, తిరుపతి నాయక్, రైస్‌మిల్ ఆపరేటర్లు, హమాలీ సంఘం నాయకులు, కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.