Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరయ్య
- కనీస వేతనాలు అమలు చేయాల్సిందే
- సంగారెడ్డి జిల్లాలో కార్మిక గర్జన పాదయాత్ర
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి, కంది
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండ చూసుకునే పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య విమర్శించారు. కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ నిర్వహిస్తున్న కార్మిక గర్జన పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న ఈ పాదయాత్ర ఆదివారం కంది మండలంలోకి ప్రవేశించింది. అక్కడి పారిశ్రామిక ప్రాంతాలు తిరుగుతూ ఇంద్రకరణ్ గ్రామానికి చేరుకుంది. పలు కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పాదయాత్ర బృందం సభ్యులు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ పాదయాత్రకు నవతెలంగాణ ఎడిటర్ సుధాభాస్కర్ మద్దతు తెలిపారు. ఇంద్రకరణ్ గ్రామంలో రాష్ట్ర కమిటీ నాయకులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సుధాభాస్కర్ మాట్లాడుతూ.. సీఐటీయూ నాయకుడిగా దశాబ్ద కాలానికి పైగా పటాన్చెరు పరిధిలో తాను పనిచేసినా నేటికీ కార్మికుల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల జీవితాలను ఛిద్రం చేస్తున్న యాజమాన్యాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరముందన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అండతో నే పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులకు కనీస వేతనం అమలు చేయడం లేదని అభిప్రాయపడ్డారు. అనంతరం వీరయ్య మాట్లాడుతూ.. కార్మికులతో పెట్టుకున్న వారు బాగుపడినట్టు చరిత్రలో లేదని స్పష్టం చేశారు.వలస కార్మికులతో పనిచేయించుకుంటూ.. బానిసల్లా చూస్తున్నారని విమర్శించారు. ప్రతి ఐదేండ్లకు ఒకసారి కనీస వేతనాలను అమలు చేయాల్సి ఉండగా ప్రభుత్వాల అండతోనే పరిశ్రమల యాజమాన్యాలు పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పరిశ్రమలో కార్మికులకు కనీస వేతనం రూ.21వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ మైనార్టీల భూములను గుంజుకుని పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని ఖండిస్తూ నేడు నిర్వహించే భారత్ బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదే విధంగా వచ్చే నెల 8న నిర్వహించే సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు పాలుపంచుకోవాలని కోరారు.
బృంద సభ్యులు పాలడుగు భాస్కర్, భూపాల్, జయలక్ష్మి మాట్లాడారు. 4 లేబర్ కోడ్స్‌ను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కెేసీఆర్ ప్రభుత్వం లేబర్ కోడ్స్‌కు మద్దతిస్తే కార్మికవర్గం తగిన బుద్ధి చెబుతుందన్నారు. పటాన్ చెరు, పాశమైలారంలో 450 కంపెనీలుండగా 22 కంపెనీల్లో మాత్రమే యూనియన్లు ఉన్నాయనీ, మిగతా కంపెనీల యాజమాన్యాలు యూనియన్ పెట్టుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. కంది మండలంలోని 22 పరిశ్రమల్లో 5 పరిశ్రమల్లో మాత్రమే కార్మిక సంఘాలున్నాయనీ, మిగతా వాటిల్లోనూ యూనియన్ ఏర్పాటు చేసి కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఐటీయూ పాదయాత్ర పూర్తయేలోపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను సవరించకుంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పాదయాత్రలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం, కార్యదర్శి రాజయ్య, ఉపాధ్యక్షులు మాణిక్, కోశాధికారి సాయిలు తదితరులు పాల్గొన్నారు.