Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటికే అమలు చేస్తున్న ఆప్ సర్కారు...
- పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం
- అమలు చేయాలంటున్న వైద్య నిపుణులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా వ్యక్తులను, వ్యవస్థలను అప్రమత్తం చేసింది. నిరంతర సమాచార వ్యాప్తి, తద్వారా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మహమ్మారులను ఎదుర్కోవాల్సిన అవసరాన్ని నేర్పింది. దాని తీవ్రతను సరిగ్గా అర్థం చేసుకోకపోతే పూర్తిగా తేలిగ్గా తీసుకోవటమో లేదంటే మరింత భయాందోళనకు గురి కావటమో జరుగుతుంది. ఈ రెండు కూడా వ్యక్తులకు గానీ, వ్యవస్థలకు గానీ మంచిది కాదనీ, శాస్త్రీయంగా దాని తీవ్రతను గుర్తించాలనీ, అదే విధంగా ప్రజలను అప్రమత్తం చేయాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. తద్వారా సామాన్యులు కూడా తాము నివసించే ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి ఏ విధంగా ఉందో ఏ రోజు కా రోజూ తెలుసుకుంటూ అప్రమత్తం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
''కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. లేదు లేదు దాదాపు తగ్గిపోయింది. కేసుల సంఖ్య తక్కువగా వస్తున్నాయి. పాజిటివ్ రేటు కూడా తక్కువగా ఉంటున్నది. ఆర్టీపీసీఆర్ టెస్టులు తక్కువగా చేస్తున్నందునే పాజిటివ్ రేటు తక్కువగా కనిపిస్తున్నది. యాంటిజెన్ టెస్టులు తగ్గించి ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచితే పాజిటివ్ రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. '' ఇలా కోవిడ్ పై ప్రజల్లో అనేక సందేహాలు, సంశయాలు. ఇక ఇతర వ్యాధులున్న వారైతే ఇప్పటికీ దేన్ని పూర్తిగా విశ్వసించాలో తెలియని అయోమయంతో మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి భయాలు, ఆందోళనలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు వాస్తవ పరిస్థితిని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వాతావరణ హెచ్చరికల మాదిరిగా రంగుల రూపంలో కరోనా హెచ్చరికలను జారీ చేసేందుకు కలర్ కోడెడ్ గ్రేడెడ్ యాక్షన్ ప్లాన్ ఉపయోగపడుతుందని ఇప్పటి వరకు ఉన్న అనుభవాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు దీన్ని అమలు చేస్తున్నది.
ఎలా ఉంటుంది?
వరుసగా రెండు రోజుల పాటు వస్తున్న పాజిటివ్ రేటు, వారం రోజుల్లో నమోదవుతున్న కొత్త కేసులు, ఏడు రోజుల్లో ఆక్సిజన్ బెడ్లపై చికిత్సకు చేరిన రోగుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని కరోనా తీవ్రతను గణిస్తున్నారు. పాజిటివ్ రేటుకు సంబంధించి 0.5 శాతం కన్నా ఎక్కువ, ఒక శాతం కన్నా ఎక్కువ, రెండు శాతం కన్నా ఎక్కువ, ఐదు శాతం కన్నా ఎక్కువగా అంటూ నాలుగు భాగాలు చేశారు. అదే విధంగా కేసుల విషయంలోనూ 1,500, 3,500, 9,000, 16,000గా, ఆక్సిజన్ బెడ్లలో ఆక్సుపెన్సీకి సంబంధించి 500, 700, 1,000, 3,000గా నిర్ణయించి వరసగా పసుపు, కాషాయం, నారింజ, ఎరుపు రంగులతో కూడిన హెచ్చరికలకు నిర్ణయించారు. పసుపు హెచ్చరికల సమయంలో తీవ్రత తక్కువగా ఉండటంతో ఆంక్షలు తక్కువగా, ఎరుపు హెచ్చరికల సమయంలో తీవ్రత ఎక్కువగా ఉందని గుర్తించి అత్యవసర సేవలు మినహా అన్నింటిని మూసేయాల్సి ఉంటుందంటూ సంస్థలు, నిపుణులు సూచిస్తున్నారు.