Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక కార్మికుని తొలగింపు.. ఇద్దరు సస్పెండ్
- 12 గంటల పని చేయాల్సిందేనని మిగతా వారిపై ఒత్తిడి
- బస్సు సౌకర్యాన్నీ తీసేసి పైశాచికానందం
- బెదిరింపు ధోరణిలో సాయి సర్ఫేస్ కోటింగ్ టెక్నాలజీ యాజమాన్యం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హక్కుల గురించి అడిగితే...సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సాయి సర్ఫేస్ కోటింగ్ టెక్నాలజీ యాజమాన్యం కార్మికులను నిర్ధాక్షిణ్యంగా గెటేసింది. ముందడుగు వేస్తే మీకూ అదే గతి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నది. 12 గంటల పనివిధానం మాకొద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే..ప్రపంచంలో ఎక్కడాలేని కొత్త షిప్టులను సృష్టించి వేధిస్తున్నది. బస్సు సౌకర్యాన్ని తీసేసి అర్ధరాత్రి ఎలా వెళ్తారో వెళ్లండి అంటూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నది. రాష్ట్రంలోని పరిశ్రమల్లో కార్మిక చట్టాలు అమలు కావడం లేదని చెప్పడానికి ఈ ఉదహరణే సజీవ సాక్ష్యం. చట్టాల అమలును పర్యవేక్షించాల్సిన కార్మిక శాఖ అధికారులను అడిగితే...'మేమేం చేయలేం' అంటూ చేతులెత్తేస్తున్న దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. సాయి సర్ఫేసింగ్ కోటింగ్ టెక్నాలజీ యాజమాన్యం తీరుపై కథనం. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడ అనేక బహుళ జాతి పరిశ్రమలకు నిలయం. 120 భారీ, మధ్యతరహా పరిశ్రమలే కాక అనేక చిన్నచిన్న కంపెనీలు కూడా ఉన్నాయి. దక్షిణాన భానూరులో బీడీఎల్ ఉంది. పశ్చిమాన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలున్నాయి. దీంతో పాటు అదే ప్రాంతంలో వందలాది పరిశ్రమలున్నాయి. అందులో సాయి సర్ఫేస్ కోటింగ్ టెక్నాలజీ యాజమాన్యం ఒకటి. మొదట బాలాపూర్‌లో 200లో ఏర్పాటు చేశారు. తర్వాత పటాన్‌చెరుకు మార్చారు. ఆ తర్వాత కంపెనీని పాశమైలారం పారిశ్రామిక వాడలోకి యాజమాన్యం మార్చింది. కంపెనీలో ఆర్డర్లపై భెల్, శాండ్విక్, సిమెంట్, జీఈ పరిశ్రమలకు చెందిన టర్బెన్లు, ఇతర యంత్రాలకు హార్డ్ కోటింగ్ వేస్తారు. ఐదుగురు కార్మికులతో ప్రారంభమైన ఈ కంపెనీ నేడు 42 మంది పనిచేస్తున్నారు. 2008 నుంచి కార్మికులకు పీఎఫ్ వర్తిస్తున్నది. యాజమాన్యం పీఎఫ్ డబ్బులు సరిగ్గా కట్టట్లేదనీ, అవతవకలకు పాల్పడుతున్నదని కార్మికులు ఆందోళనకు దిగారు. 12 గంటల పని తాము చేయలేమని యాజమాన్యాన్ని వేడుకున్నారు. ఆ తర్వాత యాజమాన్యం 18(1) ఫామ్ అని చెప్పి 16 పేపర్లపై కార్మికులతో సంతకాలు తీసుకుని వాటి కాపీలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే తమ హక్కుల కోసం యూనియన్ పెట్టుకోవాలని కార్మికులు భావించారు. అధికార పార్టీ అయితే న్యాయం దక్కుతుందనే ఉద్దేశంతో టీఆర్ఎస్కేవీ అనుబంధంగా కమిటీ వేసుకున్నారు. దానికి స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని గౌరవాధ్యక్షునిగా నియమించుకున్నారు. సంఘాన్ని పెట్టుకోవడాన్ని సహించలేని యాజమాన్యం యూనియన్ ప్రధాన కార్యదర్శి భిక్షపతిని తీసేసింది. ఎమ్మెల్యేకు పలుమార్లు కార్మికులు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే అక్కడ చాలా పరిశ్రమల్లో గుర్తింపు సంఘంగా ఉన్న సీఐటీయూ దగ్గరకు కార్మికులు వెళ్లారు. సీఐటీయూకు అనుబంధంగా సాయి సర్ఫేస్ కోటింగ్ టెక్నాలజీస్ ఎంప్లాయీస్ యూనియన్ను పెట్టుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న సీఐటీయూ జెండా ఎగురవేశారు.
అక్కడంతా యాజమాన్యం ఇష్టారాజ్యమే..
తమ సమస్యలపై కార్మికులు ఒక్కటై పోరాడటాన్ని యాజమాన్యం సహించలేకపోయింది. వెంటనే కార్మికులపై కక్షసాధింపు చర్యలకు దిగింది. పరిశ్రమ నుంచి బయటకు వెళ్లేటప్పుడు గేట్ పాస్ తీసుకువెళ్లలేదనే అపవాదును మోపుతూ..ఎలాంటి విచారణ జరుగకుండానే నిర్ధాక్షిణ్యంగా ప్రస్తుత యూనియన్ ప్రధాన కార్యదర్శి దుర్గాసుధీర్ను గెటేసింది. ఎటువంటి తప్పు చేయకపోయినా ఇద్దరు కార్మికులను సస్పెండ్ చేసింది. మరో కార్మికునికి గతేడాది ఇచ్చిన ఇంక్రిమెంట్‌ను తొలగించింది. యూనియన్‌లో భాగస్వామి అయ్యాడనే కోపంతో మూడు ఇంక్రిమెంట్లను ఆపేసింది. కార్మికులకున్న బస్సు సౌకర్యం కూడా లేకుండా చేసింది. 12 గంటల పని అంటే నిరాకరిస్తరా? అని కక్షగట్టి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కొత్త షిప్టు పద్ధతిని అమలులోకి తెచ్చింది. జనరల్ షిఫ్టు మాత్రమే గతంలో ఉండేది. ప్రస్తుతం సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు డ్యూటీలు వేస్తూ కక్షసాధింపు చర్యలకు పూనుకున్నది. మిగతావారికి ఆదివారం కూడా సెలవు ఇవ్వకుండా 12 గంటలు పనిచేయిస్తున్నది. ఇలా ఒక్కో కార్మికున్ని తొలగిస్తూ పోవడం, వేధింపులు పెరుగుతుండటంతో 38 మంది కార్మికులు గత 13 రోజులుగా సమ్మె చేస్తున్నారు.
యాజమాన్యం మొండివైఖరి సరిగాదు..సానుకూలంగా స్పందించాలి
యాజమాన్యాలు కార్మిక సంఘాలను సహించకపోవడం సరిగాదు. సంఘం పెట్టుకుంటే కార్మికులను తొలగించడం బాధాకరం. ఓటీలు చేయడంలేదని కార్మికులను తీసేయడం అన్యాయం. యూనియన్ కార్యదర్శిని తొలగిస్తే కార్మికులను ఐక్యం కాకుండా విచ్ఛిన్నం చేయొచ్చనే ఉద్దేశంతోనే రెండు సార్లు ఇలా చేసింది. ఓపిక, సహనం ఉన్నంత వరకే కార్మికులు భరిస్తారు. వేధింపులకు పాల్పడితే ఎవ్వరూ ఊరుకోరు. తమ సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు ఆ కంపెనీ కార్మికులంతా ఒక్కతాటిపైకి వచ్చి పోరాడటం అభినందనీయం. యాజమాన్యం మొండివైఖరిని విడనాడి కక్షపూరిత చర్యలను మానుకోవాలి. గతంలో తొలగించిన వారినీ విధుల్లోకి తీసుకోవాలి. ప్రతిచిన్నదాన్నీ సాకుగా చూపెట్టి సస్పెండ్లు చేయడం, చార్జిషీట్లను ఇవ్వడాన్ని ఆపేయాలి. వేతనాల్లో కోతల్ని ఆపాలి. బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలి. గతంలో మాదిరిగానే జనరల్ షిప్టు, 8 గంటల పనివిధానాన్ని అమలు చేయాలి. యాజమాన్యం దీనిపై సానుకూలంగా స్పందించాలి.
జె.మల్లిఖార్జున్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి