Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ చెప్పుల్లో కేసీఆర్ అడుగులు
- పాలకపార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయి
- మాలిని భట్టాచార్య, మరియం ధావలే
సూర్యాపేట(అనిగెళ్ల అరుణానగర్) నుంచి బి.బసవపున్నయ్య
దేశవ్యాప్తంగా మహిళలు అప్పుల్లో కూరుకుపోతున్నారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మాలిని భట్టాచార్య, మరియం ధావలే ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ చెప్పుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో అనేక హామీలిచ్చిన పాలకపార్టీలు ప్రజలను, ప్రధానంగా మహిళలను తీవ్రంగా మోసం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం సూర్యాపేటలో జరిగిన ఐద్వా రాష్ట్ర మహాసభల ముగింపు సందర్భంగా వారు సంయుక్తంగా విలేకర్లతో మాట్లాడారు. మహిళలకు ఎలాంటి ఉపాధి అవకాశాల్లేక డ్వాక్రా రుణాలు భారీగా తీసుకుంటున్నారనీ, చెల్లించే స్థోమతలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. సంపాదన పడిపోవడంతో పేద కుటుంబాలు సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయనీ, దీంతో మహిళల కష్టాలు మరింత పెరుగుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో మహిళల ఉపాధి కోసం కేసీఆర్ సర్కారు ప్రత్యేక పథకాలు రూపొందించలేదని గుర్తు చేశారు. బేటీ బచావ్, బేటీ పడావ్ పథకం సక్రమంగా అమలుకావడం లేదని చెప్పారు. నిర్భయ ఫండ్‌కు రూ 1000 కోట్లు కేటాయించిన కేంద్రం, వాటిని ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని విమర్శించారు. సమాజంతో మనుస్మృతి ప్రభావం పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సమాన హక్కుల కోసం పోరాటం చేస్తామనీ, రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని వివరించారు. మోడీ విధానాలనే కేసీఆర్ అనుసరిస్తున్నారని విమర్శించారు. సోమవారం జరిగే భారత్‌బంద్‌కు ఐద్వా సంపూర్ణ మద్దతును ఇస్తున్నదనీ, అందరూ బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మోడీ ఓటమే ఐద్వా ధ్యేయమని వ్యాఖ్యానించారు. మహిళల అభ్యున్నతి కోసం ఐద్వా సాధ్యమైనంత మేర కృషి చేస్తున్నదని తెలిపారు. ఆకలి, విద్య, ఆహారభద్రత కోసం ఐద్వా పోరాడుతుందని చెప్పారు. దీని కోసం దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం చేపడతామని వివరించారు. మోడీ, కేసీఆర్‌ను ప్రజలు ఎన్నుకున్నారనీ, వారికి బాధ్యత వహించాలని కోరారు. ప్రజల పట్ల వారు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశంలో కనీసం రేషన్ సరుకులు దొరకడం లేదనీ, కొందరికైతే అసలు రేషన్‌కార్డులే లేవన్నారు. అందుకే సామాన్యులంతా ఆకలితో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం అంగన్వాడీలకు బడ్జెట్ తగ్గిస్తున్నదన్నారు. కరోనాకాలంలో ఈ నిధులను తగ్గించారనీ, గర్భిణులకు అన్యాయం జరుగుతున్నదని వివరించారు. జాతీయ విద్యావిధానం సరిగ్గాలేదనీ, ప్రస్తుత వ్యవస్థను నాశనం చేస్తున్నారని విమర్శించారు. దళిత, ఆదివాసీ, కార్మికవర్గాల హక్కులకు భంగం కలుగుతున్నదన్నారు. దేశంతోపాటు రాష్ట్రంలో టీచర్ల నియామకాలు, మౌళిక సదుపాయాలు కల్పన విరివిగా జరగాలని అభిప్రాయపడ్డారు. పబ్లిక్ స్కూళ్లను మూసేస్తూ విద్యను ప్రజలకు దూరం చేస్తున్నారనీ, ప్రయివేటు రంగాన్ని ప్రొత్సహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఐద్వా రాష్ట్ర మహాసభల్లో కేసీఆర్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశామని తెలిపారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ ఐద్వా రాష్ట్ర మహాసభల్లో ఎనిమిది తీర్మానాలు చేసినట్టు తెలిపారు. పట్టణాల్లో ఉపాధి హామీని అమలుచేయాలని డిమాండ్ చేశారు. మహిళల భద్రతకు, రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు తేవాలని విజ్ఞప్తి చేశారు. మహాసభల్లో చేసిన తీర్మానాల కాపీలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని వారు వివరించారు.