Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు తెలంగాణ రైతు సంఘం లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఇటీవల కురిసిన గులాబ్ తూఫాన్ వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం, ఆయా పంటలకు బీమాను చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం కోరింది. అధిక వర్షాల వల్ల 2.20 లక్షల ఎకారాల్లో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఈమేరకు గురువారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పెసరకాయల జంగారెడ్డి, తీగల సాగర్ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. నిజామాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, పెద్దపల్లి, ములుగు, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలతోపాటు మిగతా ప్రాంతాల్లోనూ పంటలకు నష్టం జరిగిందని పేర్కొన్నారు. వరి, పత్తి, సోయా, పసుపు, పొగాకు, మక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఆగస్టు 30నుంచి సెప్టెంబర్ 4వరకు కురిసిన వర్షాల వల్ల 8లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. 2020-2021లో అతివష్టి వల్ల 12.65లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే, ప్రభుత్వం మాత్రం ఎక్కడా దెబ్బతినలేదంటూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయటం విచారకరమని పేర్కొన్నారు. కేంద్రానికి లేఖలు రాసిన తర్వాత రాష్ట్రంలో పెద్దగా పంట నష్టం జరగలేదంటూ ప్రభుత్వ న్యాయవాది హైకోర్టులో ఫిటిషన్ వేయడం సరైందికాదని పేర్కొన్నారు.
ఇప్పటివరకు వానలకు 54 మంది రైతు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం గణాంకాలు సేకరించడానికి ప్రయత్నించకపోవడం విచారకరమని తెలిపారు. రైతులను ఆదుకోవడానికి వీలుగా వెంటనే హైకోర్టు తీర్పు ప్రకారం గణాంకాలు సేకరించి, కౌలు రైతులతో సహా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తమ నిధుల నుంచి మొదట చెల్లించి ఆ తర్వాత కేంద్రం నుంచి రాబట్టుకోవాలని సూచించారు. జరిగిన నష్టాన్ని కేంద్రానికి వివరించి నిధులు కోరాలనీ, కేంద్ర బందాలు వచ్చి నష్టాన్ని అంచనా వేయాలని విజ్ఞప్తి చేశారు.