Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిలపక్షం నాయకుల డిమాండ్
- ఫులాంగ్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ
నవతెలంగాణ- కంఠేశ్వర్
పోడు రైతుల భూముల సమస్యలు తీర్చాల్సింది ప్రభుత్వమేనని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గురువారం అఖిలపక్షం ఆధ్వర్యంలో పోడు రైతులకు హక్కులు కల్పించాలని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఫులాంగ్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్‌కు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఏఐకెేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ మాట్లాడుతూ.. 40 ఏండ్లుగా గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు 2006 అటవీ హక్కుల చట్టం అమలు చేసి భూములపై హక్కులు కల్పించాలని కోరారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు మాట్లాడుతూ.. ఏండ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం కందకాలు తవ్వుతూ పోలీసులతో దౌర్జన్యాలు చేయిస్తున్నదనీ, పేద రైతుల కడుపులు కొడుతున్నారని విమర్శించారు. పోడు రైతుల హక్కులు సాధించేవరకూ రైతులతో కలిసి పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. పోడు భూముల హక్కుల సాధనకై ఈ నెల 5వ తేదీన ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు అఖిల పక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే రహదారి నిర్బంధానికి పోడు రైతులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం పోడు భూముల చట్టాన్ని తుంగలో తొక్కుతోందన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. 40 ఏండ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల్లో అటవీ అధికారులు దౌర్జన్యంగా కందకాలు తవ్వుతున్నా జిల్లా అధికారులు, మంత్రులు దీనిపై మాట్లాడడం లేదని ఆరోపించారు. ఈ మధ్యకాలంలో గంగారాయి గ్రామంలో గిరిజన మహిళ ఆత్మహత్యకు పాల్పడిందనీ, అయినా ఎవరూ స్పందించలేదన్నారు. సీపీఐ(ఎం) నాయకులు సబ్బని లత, నూర్జహాన్, గోవర్ధన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, అర్బన్ ఇన్చార్జి తాహెర్‌బిన్ హందాన్, కార్యదర్శి నాగేష్‌రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, అఖిల పక్షం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.