Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 69 మందితో రాష్ట్ర కమిటీ ఎన్నిక
నవతెలంగాణ - సూర్యాపేట
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రజానాట్యమండలి రాష్ట్ర రెండో మహాసభ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా 69 మందితో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. అంతకుముందు సభలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జున్‌రెడ్డి మాట్లాడారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో కళాకారుల రాష్ట్ర మహాసభ జరుపుకోవడం అంటే నాటి పోరాటాలు, పోరాట యోధులను స్మరించుకోవడమే అన్నారు. దేశంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు జరుగుతున్న సందర్భంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర మహాసభ జరుపుకోవడంతో ఉద్యమాలకు ఊపు వచ్చిందన్నారు. కళాకారులు లేని పోరాటం, ఉద్యమం, త్యాగాలు లేవన్నారు. నాటి వీర తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేడు జరిగిన ప్రత్యేక తెలంగాణ పోరాటం వరకు కళాకారులు నిర్వహించిన పాత్ర మరువలేనిదన్నారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో బండి యాదగిరి రాసిన ''బండెనక బండి కట్టి'' పోరాటానికి ఊతం ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి శాంతారావు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహా, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బచ్చలకూర రాంబాబు, వేల్పుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర నూతన కమిటీ
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆనంద్, నర్సింహా
మహాసభ చివరి రోజు రాష్ట్ర నూతన కమిటీని 69 మందితో ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఆనంద్, ఉపాధ్యక్షులుగా అవ్వారి గోవర్ధన్, సాంబరాజు, యాదగిరి, స్ఫూర్తి, వేల్పుల వెంకన్న, కె.శాంతారావు, భాస్కర్, రాంపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శిగా కట్ట నర్సింహా, సహాయ కార్యదర్శులుగా వినోద్‌కుమార్, కొండూరి భాస్కర్, కుమ్మరి శంకర్, సదానంద్, కళ్యాణ్, గౌతమి, జక్కిడి నరసింహారెడ్డిని ఎన్నుకున్నారు.
తీర్మానాలు
1. ప్రతి కళాకారుడికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి. ప్రభుత్వ పథకాల్లో కళాకారులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
2. కళాకారులకు నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ఆడిటోరియం నిర్మించాలి.
3. ప్రజా కళాకారులు ప్రదర్శనకు వెళ్లే సమయంలో రైలు, బస్సులో రాయితీ ఇవ్వాలి.
4, జానపద సంస్కృతి పరిరక్షణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి.
5, దేశం, రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ప్రజా ఉద్యమాలకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి.